Share News

తొలిరోజే సంచలనం!

ABN , Publish Date - May 28 , 2026 | 04:38 AM

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించాక.., తొలి మహానాడులోనే సంచలన ప్రతిపాదనతో ముందుకు రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

తొలిరోజే సంచలనం!

  • శ్రేణుల హాజరులో రికార్డు..1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది హాజరు

  • మొదటి రోజు అందిన విరాళాలు రూ.11.70 కోట్లు

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ బాధ్యతలు స్వీకరించాక.., తొలి మహానాడులోనే సంచలన ప్రతిపాదనతో ముందుకు రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీపరంగా మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలన్న ఆయన ప్రతిపాదన.. స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయానికి సార్థకత చేకూర్చేలా ఉందని టీడీపీ మహిళా నేతలు తబ్బిబ్బవుతున్నారు. లోకేశ్‌ తన ప్రతిపాదన గురించి బుధవారం ఉదయమే ఎక్స్‌లో.. ‘ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద ప్రకటన కోసం ఎదురుచూడండి’ అంటూ ఉత్కంఠ రేపారు. చివరకు అందరినీ ఆకర్షించే పెద్ద ప్రకటన చేసి.. ఉత్కంఠకు న్యాయం చేశారు. జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూనే.. వైసీపీని పంచ్‌లతో ఆడుకున్నారు. కార్యకర్తల్లో జోష్‌ నింపారు. తన 43 నిమిషాల ప్రసంగంలో పార్టీ 44 ఏళ్ల ప్రస్థానాన్ని.. ఐడియాలజీని గుర్తు చేశారు. 23 నెలల్లో ప్రభుత్వ విజయాలను.. భవిష్యత్‌ ఆలోచనలను ఆవిష్కరించారు. గొడ్డలి పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ.. ప్రాసతో.. పంచ్‌లతో ఆలోచింపచేసేలా ఆయన ప్రసంగం సాగింది. టీడీపీ కార్యకర్తలు ఎంత క్రమశిక్షణగా మెలగాలో దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు రికార్డు సంఖ్యలో హాజరయ్యారు. 1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం నిర్వహించగా 9991 మందికిగాను 9991 మంది హాజరయ్యారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో అనే అంశాలపై మహానాడు మొదటి రోజు 4 తీర్మానాలు ఆమోదించగా.. మొత్తం 48 మంది మాట్లాడారు. విరాళాలు వెల్లువెత్తాయి. మొత్తం రూ.11.70 కోట్లు వచ్చాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు కలిసి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఎంపీ సానా సతీశ్‌ రూ.1.5 కోట్లు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, భాష్యం ప్రవీణ్‌, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రూ.కోటి చొప్పున ఇచ్చారు. ఇంకోవైపు.. హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించుకుంటున్న మహానాడుకు మొదటిరోజు 7 లక్షల మందికిపైగా వర్చువల్‌గా హాజరు కావడం ఓ చరిత్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో టెలికాన్ఫరెన్సులో అన్నారు.

Updated Date - May 28 , 2026 | 04:38 AM