పేదల సేవలో..!
ABN , Publish Date - May 28 , 2026 | 04:39 AM
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ వర్గాలకు అందిస్తున్న సంక్షేమంపై ‘పేదల సేవలో’ తీర్మానాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు బుధవారం మహానాడులో ప్రవేశపెట్టారు.
తీర్మానం ప్రవేశపెట్టిన కాలవ శ్రీనివాసులు
సూపర్ సిక్స్‌పై గొడ్డలి పార్టీ దుష్ప్రచారం: వేమిరెడ్డి
బీసీ రక్షణ చట్టం తెచ్చిన లోకేశ్: కొల్లు
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ వర్గాలకు అందిస్తున్న సంక్షేమంపై ‘పేదల సేవలో’ తీర్మానాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు బుధవారం మహానాడులో ప్రవేశపెట్టారు. పింఛన్ల పంపిణీలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఇదే అంశంపై పలువురు నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. దేశమే నివ్వెరపోయేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా సూపర్ సిక్స్ పవర్ ఏమిటో తెలుస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని స్థాయిలో పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వంటి పథకాల అమలుతో ప్రభుత్వం ప్రజల మనసులను గెలుచుకుంటోందన్నారు. బీసీ సంక్షేమంపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసమే టీడీపీ పుట్టిందన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కిందన్నా.. వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నా.. అది టీడీపీ ఘనత అన్నారు. యువగళంలో ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి, మాట నిలబెట్టుకున్న నాయకుడు లోకేశ్ అని తెలిపారు. దళితుల సంక్షేమంపై ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. దళితుల్లో 59 కులాలకు అంతర్గత సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో వర్గీకరణకు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు. దళితుల స్థితిగతులను మెరుగుపర్చేందుకు జస్టిస్ పున్నయ్య కమిటీ వేసి ఆ కమిటీ సూచనలు అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం ఢిల్లీలో నిలిపేలా బాలయోగిని స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులపై ఎన్నడూ లేనంతగా దాడులు జరిగాయని వివరించారు. చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే జగన్ అరాచకాన్ని వికేంద్రీకరించారని ఎద్దేవా చేశారు.