Share News

మహానాడు పనులకు ఘనంగా భూమిపూజ

ABN , Publish Date - May 07 , 2026 | 04:07 AM

టీడీపీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సభల పనులను బుధవారం నెల్లూరులో ఘనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు...

మహానాడు పనులకు ఘనంగా భూమిపూజ

  • హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు

నెల్లూరు, మే 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సభల పనులను బుధవారం నెల్లూరులో ఘనంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులతోపాటు జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఎంపీ వేమిరెడ్డి దంపతులు పలుగు పట్టి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు నగరానికి సమీపంలో చెన్నై-విజయవాడ జాతీయ రహదారి పక్కన వేల ఎకరాల్లో ఉన్న ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో మహానాడును నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు సెజ్‌లో భూమి పూజ చేసి పనులను మొదలు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం తరువాత నెల్లూరులో తొలిసారిగా మహానాడు నిర్వహించనుండటంతో దీన్ని అత్యంత వైభవంగా, చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలని పార్టీ జిల్లా నాయకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రులు రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ఈ మూడు రోజుల పండుగను అందరూ మొచ్చుకునేలా ఘనంగా నిర్వహిస్తామని, నెల్లూరులో జరగబోయే మహానాడు తెలుగుదేశం చరిత్రలో ఒక చెరిగిపోని తీపి గుర్తుగా నిలిచేలా విజయవంతం చేస్తామన్నారు. 2200 ఎకరాల సువిశాల ప్రాంగణం కావడంతో మహానాడుకు లక్షలాదిగా తరలివచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్‌కు, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. జిల్లాలోని నాయకులందరి సమష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామన్నారు. భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేశ్‌, పాశిం సునీల్‌ కుమార్‌, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌తోపాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 04:07 AM