వైసీపీ బాటలో వెళ్లొద్దు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:29 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
చట్టాన్ని గౌరవించి, సంయమనం పాటించండి
అలజడులు రేపే కుట్రల్లో భాగంగానే వైసీపీ బూతులు
కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి
చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పమన్నారు
పార్టీ నేతలతో పల్లా, అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు మనమూ అదే బాటలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన చర్య కాదని, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయాన్ని పార్టీ నేతలందరికీ స్పష్టంగా చెప్పాలని ఆదేశించారని తెలిపారు. గత కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పల్లా అన్నారు. సోమవారం పార్టీ నేతలతో పల్లా శ్రీనివాసరావు, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు పల్లా, అచ్చెన్నాయుడుతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన విషయాలను వారిద్దరూ పార్టీ నేతలకు వివరించారు. పార్టీ నేతలతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం వైసీపీ వారికి ఇష్టం లేదని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలు బూతుపురాణం ఎత్తుకున్నారని, వైసీపీ వారి కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా పార్టీ నేతలకు చెప్పాలని ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చీదరించుకుంటున్నారని, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని వివరించారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దీన్ని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. టీడీపీకి స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని గౌరవించే వారిగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, అదే మన పార్టీకి బలమైన బ్రాండ్ ఇమేజ్ అని పల్లా వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సముచిత కేటాయింపులు చేశారని, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఆ ఉచ్చులో పడొద్దు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ చూడని పాలనను చూశామని, ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీని రాజకీయంగా అంతమొందించాలనే ఉద్దేశంతో కుట్రలు చేశారని, చంద్రబాబును జైలుకు పంపారని, అయినా పార్టీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదని అన్నారు. ఎట్టకేలకు విధ్వంస పాలన ముగిసి కూటమి అధికారంలోకి వచ్చిందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని 20 నెలల్లోనే గాడిలో పెట్టామని తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని అన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై బాధ ఉన్నా, ప్రతి చర్య పేరుతో హింసకు దిగడం సరైనది కాదని అన్నారు. వైసీపీ నాయకులు వాడుతున్న భాష ప్రజలకు అసహ్యం కలిగిస్తోందని అన్నారు. సీనియర్ నాయకుడిని జుగుప్సాకరమైన బూతులతో తిట్టడంపై కార్యకర్తల్లో ఆవేదన ఉన్నా, చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని తెలిపారు. దాడులు, హింస టీడీపీ సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలతోనే ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడంతో దారి మళ్లించేందుకే వైసీపీ ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరూ ఓపికతో వ్యవహరించాలని, రాష్ట్రానికి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలని కోరారు.