Share News

సంస్కార హీనులు!

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:53 AM

సభ్యసమాజం తల దించుకునేలా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సంస్కార హీనులు!

  • ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదు

  • రాష్ట్రంలో అశాంతి రేపేందుకు వైసీపీ ప్లాన్‌

  • అంబటి వ్యాఖ్యలపై టీడీపీ నేతల ధ్వజం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

సభ్యసమాజం తల దించుకునేలా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు శనివారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో స్థాయిని మరిచి, సంస్కారాన్ని వదిలేసి మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించినప్పటికీ.. వైసీపీ నేతల్లో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అశాంతిని రగిల్చేందుకు పక్కా ప్లాన్‌తోనే వైసీపీ తన పార్టీ నాయకులతో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తోందని ఆరోపించారు. అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని పలు చోట్ల అంబటి దిషిబొమ్మలను దహనం చేశారు. అటు బీజేపీ నేతలు కూడా రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు.

ప్రజలు ఛీత్కరించినా మార్పు రాలేదు: వర్ల

ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని, అంబటి వ్యాఖ్యలు నీచత్వానికి నిదర్శనమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. గతంలో జగన్‌ భార్య భారతి గురించి ఓ టీడీపీ కార్యకర్త అనుచితంగా మాట్లాడితేనే చంద్రబాబు అతడిని వెంటనే అరెస్టు చేయించారని గుర్తుచేశారు. అత్యంత నీచమైన భాష వాడిన అంబటిపై జగన్‌ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.


చెప్పులతో కొట్టి ఊరేగిస్తాం: ఎమ్మెల్యే రాజు

వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్కడ కనిపించినా టీడీపీ కార్యకర్తలు చెప్పులతో కొడతారని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబు వంటి నాయకుడి గురించి నీచంగా మాట్లాడిన వాడు నడిరోడ్డుపై ఎక్కడ కనిపించినా.. చెప్పులతో కొట్టి ఊరేగిస్తామని హెచ్చరించారు. నాలుక ఉంది కదా అని మాట్లాడితే.. నాలుక చీరేస్తామన్నారు.

నోటికొచ్చింది మాట్లాడితే.. ఊరుకోం: నాదెండ్ల బ్రహ్మం

అంబటి రాంబాబు రాజకీయ పతనం మొదలైందని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి ఉదంతం వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటుండటంతో దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ నాయకులు రోడ్ల మీద పడి వీరంగం ఆడుతున్నారన్నారు.

అంబటి క్షమాపణలు చెప్పాలి: టీఎన్‌యూఎస్‌

అంబటి వ్యాఖ్యలను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, రామిశెట్టి వెంకటేశ్వర్లు ఖండించారు. రాజకీయాల్లో నిర్మాణాత్మక విమర్శలు చేసుకోవాలి గానీ.. ఒక సీఎంపై సభ్యసమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అంబటి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


బహిరంగ క్షమాపణ చెప్పాలి: పల్లా

రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ.. వ్యక్తిత్వ హననం కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అంబటి వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని దూషించినట్లు కాదని, రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన దశాబ్దాల చరిత్ర గల దార్శనికుడిని అవమానించడమన్నారు. సంస్కారాన్ని వదిలేసి మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తీవ్రంగా ఖండిస్తున్నాం: బీజేపీ నేత వల్లూరు

వ్యక్తిత్వ హననం చేయడమే రాజకీయం అనుకునే వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాకపోవడం బాధాకరమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ వ్యాఖ్యానించారు. వినడానికే జుగుప్సాకరంగా ఉన్న అంబటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని చట్టపరంగా ప్రభుత్వం, రాజకీయంగా ఆయన పార్టీ చర్య తీసుకుంటే మరొకరు ఇటువంటి వ్యాఖ్యలు చేయబోరని అభిప్రాయపడ్డారు. సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తే జగన్‌కు రాజకీయంగా పుట్టగతులు ఉండబోవన్నారు.

సభ్య సమాజం తలదించుకునేలా..: పాలంకి

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్‌ అన్నారు. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎంను అసభ్య పదజాలంతో తిట్టడాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఖండిస్తున్నరన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 04:53 AM