TDP Leaders: జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలు దహనం
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:30 AM
వైసీపీ హయాంలో జగన్ ఫొటోతో రైతులకు జారీ చేసిన పాస్ పుస్తకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
బెజవాడలో భోగి మంటల్లో వేసిన టీడీపీ నేతలు
విజయవాడ సిటీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జగన్ ఫొటోతో రైతులకు జారీ చేసిన పాస్ పుస్తకాలను తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. విజయవాడలోని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో బుధవారం భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీ చిన్ని, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, పార్టీ నాయకులు బొప్పన భవకుమార్, సీతారామయ్య, షేక్ ఆషా, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాలను నాయకులు భోగి మంటల్లో వేశారు. ఎంపీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన విధానాలను ఇప్పుడు ఆ పార్టీ నేతలే భోగి మంటల్లో కాల్చుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మను ముద్రించడాన్ని తప్పుబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజముద్రతో పాస్ పుస్తకాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్ బొమ్మతో ముద్రించిన పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేసి కొత్త సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.