శవం, సింపతీ, విగ్రహం.. ఇదే గొడ్డలి పార్టీ విధానం
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:26 AM
‘శవం, సింపతీ, స్టాట్యూ... గొడ్డలి పార్టీ విధానమిది. వైఎస్ మరణంతో రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు పెట్టి రాజకీయం చేశారు. ఇప్పుడు అవే విగ్రహాలను ధ్వంసం చేసి రాజకీయం చేస్తున్నారు...
కుట్రలు, అసత్య ప్రచారాలు ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్నాయి
వైఎస్ విగ్రహం ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే
అతని భార్యకు ఉద్యోగం వచ్చిందీ వారి హయాంలోనే: మంత్రి అనగాని
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
‘శవం, సింపతీ, స్టాట్యూ... గొడ్డలి పార్టీ విధానమిది. వైఎస్ మరణంతో రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు పెట్టి రాజకీయం చేశారు. ఇప్పుడు అవే విగ్రహాలను ధ్వంసం చేసి రాజకీయం చేస్తున్నారు’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం వెనుక గొడ్డలి పార్టీ ఉందనే సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్య అనే గొడ్డలి పార్టీ కార్యకర్త భార్యకు గత ప్రభుత్వంలోనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చారని సాక్ష్యాలతో సహా మీడియా ముందు ఉంచారు. తాము, తమ కుటుంబం వైసీపీకి చెందిన వాళ్లమని జంబులయ్య, ఆయన కుటుంబం సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలనూ మీడియాకు ప్రదర్శించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలను గొడ్డలి పార్టీ కార్యకర్త జంబులయ్యతో తీయించి, దాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మనుషుల తలలే తీసిన గొడ్డలి పార్టీ నేతలకు... విగ్రహాల తలలు తీయడం ఓ లెక్క కాదన్నారు. కుట్రలు పన్నడం, అసత్య ప్రచారం చేయడం గొడ్డలి పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించారు.
విష వృక్షం వైసీపీ: కాలవ
‘వైసీపీ రాజకీయాల్లో విష వృక్షంలా మారింది. అలాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా..! ప్రజలు ఆలోచించాలి’ అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడకూడదనే దురుద్దేశంతో వైసీపీ డీఎస్సీపై విషప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో 13 డీఎస్సీల్లో సుమారు 1.90 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం’ అని అన్నారు.
వైసీపీ సమాధి కావడం ఖాయం: అచ్చెన్న
గొడ్డలిపోటు రాజకీయాలు చేసే వైసీపీ భవిష్యత్‌లో పూర్తిగా సమాధి కావడం ఖాయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తోటాడలో ఆయన మాట్లాడారు. ‘సొంత మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్ అండ్ కో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం, 2019-24లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి’ అని సవాల్ చేశారు.
16 వేల మంది ఉపాధ్యాయులపై గొడ్డలి వేటు వేసే కుట్ర: రవినాయుడు
బాబాయ్‌ని గొడ్డలి వేటుతో చంపినట్లు.. 16 వేల మంది ఉపాధ్యాయులను చంపాలని గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ, గతంలో గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన 2000 పోస్టులను ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్‌వి మతిలేని మాటలు: నిమ్మల
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల ఊసెత్తని జగన్ ఇప్పుడు మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థులు ప్రతిభతో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధిస్తే తప్పుడు ప్రచారంతో వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు’ అని విమర్శించారు.
విషప్రచారం మానుకోవాలి: నాగోతు
మెగా డీఎస్సీపై జగన్‌రెడ్డి విషప్రచారం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు హితవు పలికారు.