వైఎస్ కుటుంబ చరిత్రలో అన్నీ రక్తపు మరకలే
ABN , Publish Date - May 24 , 2026 | 03:52 AM
వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరకు వారి కుటుంబ రాజకీయ చరిత్రలో అన్నీ రక్తపు మరకలేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ధ్వజమెత్తారు.
బుద్ధిమంతుల కుటుంబమని జగన్ చెబుతున్నారు
వారి రాజకీయ సామ్రాజ్యం హత్యలు, గృహ దహనాలతో మొదలైంది
వారి అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు
రాజారెడ్డిపై 1962లోనే రౌడీషీట్ నమోదైంది
వందల కొద్దీ బైండోవర్ కేసులున్నాయి..
బెరైటీస్ యజమానిని హత్య చేయించారు
రాజారెడ్డి, జార్జిరెడ్డి జైలుకెళ్లారు
నా తమ్ముడిని చంపిన కేసులో.. ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి నిందితులు
వారిపై కేసులను రాజశేఖర్‌రెడ్డి కొట్టివేయించారు
వాళ్ల చరిత్రను ఈ తరం యువతకు తెలియజేస్తా: పేర్ల పార్థసారథిరెడ్డి
కడప, మే 23 (ఆంధ్రజ్యోతి): వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరకు వారి కుటుంబ రాజకీయ చరిత్రలో అన్నీ రక్తపు మరకలేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలు, గృహ దహనాలతోనని చెప్పారు. శనివారం కడప ప్రెస్‌క్లబ్‌లో పార్థసారథిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తన తాతను హత్య చేసిన వారిని వదిలేశానని, తమది బుద్ధిమంతుల కుటుంబమని జగన్ పదేపదే చెబుతున్నారని.. వారిది ఎంతటి బుద్ధిమంతుల కుటుంబమో ఈ తరం యువతకు తెలియజేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావని.. ఆ కుటుంబం సాగించిన నరమేథం, కిరాయిహత్యలు, ప్రత్యక్ష, పరోక్ష హత్యలు, గృహ దహనాలు, పంటల నాశనం మొదలైనవాటిని తెలియజెప్పేందుకే తాను మీడియా ముందుకొచ్చానని తెలిపారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లానని చెప్పారు. దాంతో ఆ ఏడాది ఆగస్టులో రాజారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి హంతకులతో తనను విచక్షణారహితంగా కత్తులతో నరికించారని.. ఆ కేసులో ఆయన మొదటి ముద్దాయి అని తెలిపారు. ఆ కేసులో జైలుకు వెళ్లిన రాజారెడ్డి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జగన్ పెళ్లికి పులివెందులకు వచ్చారన్నారు.
హత్యలు.. దాడులు
‘1975 జూలై 15న వైఎస్ రాజారెడ్డి, జార్జిరెడ్డితోపాటు 63 మంది కలిసి బెరైటీస్ గనుల యజమాని ఎం.వెంకటనర్సయ్యను హత్య చేశారు. దీనిపై కడప వన్‌టౌన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇదే కేసుకు సంబంధించి వీరిపై మీసా చట్టం కూడా ప్రయోగించారు. రాజారెడ్డితోపాటు పెద్దకుమారుడు జార్జిరెడ్డిని కూడా జైల్లో పెట్టారు. 1989 ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు సర్కిల్‌లోని చిన్నముడియంలో అల్లర్లకు పాల్పడిన కేసులో వైఎస్ రాజారెడ్డి ఏ4గా ఉన్నారు. టీడీపీకి చెందిన ఎల్.వెంకటరమణారెడ్డి తన భార్యతో కలిసి ఓటు వేసి తిరిగి వస్తుంటే రాజారెడ్డి, ఆయన వర్గీయులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వెంకటరమణారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 1990 ఫిబ్రవరి 16న పులివెందులలోని నగరిగుట్ట, ఎరుకల కాలనీపై రాజారెడ్డి 300 మంది అనుచరులతో కలిసి దాడులకు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లలోకి చొరబడి విలువైన నగలు, రూ.16 లక్షల నగదు దోచుకున్నారు. అనంతరం ఇళ్లకు నిప్పంటించారు. రాజారెడ్డి సహా 59 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 1992 అక్టోబరు 11న కోడూరు పోలీసుస్టేషన్‌లో రాజారెడ్డి, ఆయన అనుచరులు మారణాయుధాలతో ప్రవేశించి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని బెదిరించారు. అరెస్టయి పోలీసుస్టేషన్‌లో ఉన్న తమ వారిని విడిపించుకుపోయారు. ఈ వ్యవహారంలో అదే నెల 14న రాజారెడ్డిని అరెస్టు చేశారు. 1992 డిసెంబరులో భూవివాదానికి సంబంధించి హైదరాబాద్‌లో తాజ్‌మహల్ హోటల్‌లో ఉన్న రాజగోపాల్ అనే వ్యక్తిపై రాజారెడ్డి, ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించి అబిడ్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు షేక్ రహంతుల్లా గనులపై దండయాత్ర చేసి మైనింగ్ సామగ్రిని, లారీలను ధ్వంసం చేసి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. కోడూరులో అక్రమ మైనింగ్‌పై వైఎస్ కుటుంబంపై పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. గనులు కొల్లగొట్టేస్తుంటే అప్పటి సీఎం విజయభాస్కర్‌రెడ్డి రూ.50 లక్షలు పెనాల్టీ వేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెనికలపాడు పోలింగ్‌స్టేషన్‌లో రాజశేఖర్‌రెడ్డి లైసెన్స్ లేని తుపాకీతో కాల్పులు జరిపితే ముద్దనూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
జమ్మలమడుగు శివారెడ్డిని తుదముట్టించేందుకు దేవగుడి బ్రదర్స్‌ను ఉసిగొల్పింది వైఎస్ కుటుంబమే. మమ్మల్ని మేం కాపాడుకునేందుకు 1998లో అనుకోకుండా జరిగిన సంఘటనలో రాజారెడ్డి హతమైపోయాడు. ఆరోజు దారుణకాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరరెడ్డిని చంపేశారు. ఈ కేసులో నీకు (జగన్‌కు) పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, నువ్వు సంకనెక్కించుకున్న వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఏ6, ఏ7 ముద్దాయిలు కాదా? రాజారెడ్డి కేసులో మా వాళ్లకు జీవితఖైదు పడింది. గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డిలపై ఉన్న కేసును రాజశేఖర్‌రెడ్డి కొట్టివేయించారు. ఆయన చనిపోయేవరకు చట్టబద్ధంగా మావాళ్లకు రావలసిన పెరోల్ కూడా రాలేదు. వాస్తవానికి రాజారెడ్డిపై 1962లోనే పోలీసులు రౌడీషీట్ నమోదైంది. వందల బైండోవర్ కేసులున్నాయి.. అటువంటి కరుడుగట్టిన హంతకుడు శాంతికాముడైనట్లుగా.. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి.. హైదరాబాద్‌లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి వందల మంది చావుకు కారణమైన రాజశేఖర్‌రెడ్డి అహింసామూర్తి అన్నట్లుగా ఆయన కొడుకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన కడుపున పుట్టిన నువ్వు మాత్రం ఏం చేశావు? పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయేంత భయంకరంగా చిత్రవధ చేసి చంపారు. చంపిందే గాక గుండెపోటు అని ప్రచారం చేయించారు. చంద్రబాబునాయుడు, ఆదినారాయణరెడ్డి మా చిన్నాయన్ను చంపారని చెప్పి రాష్ట్రమంతా ప్రచారం చేయించావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నరరూప రాక్షసుడు ఉండడు’ అని జగన్‌పై పేర్ల విరుచుకుపడ్డారు. న్యాయం కోసం వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టు వీధుల వెంట మండుటెండల్లో ఫైళ్లు పట్టుకొని కాలినడకన రోడ్డుపైన వెళ్తుంటే కన్నీరు కార్చని వారు లేరన్నారు. సొంత చెల్లి షర్మిలకు ఆస్తి పంచకుండా నువ్వు చేసిందేమిటని నిలదీశారు. ‘మీదేదో రాజకుటుంబం అయినట్లు, హరిశ్చంద్రుడి వంశమైనట్లు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమైనట్లు చెబుతున్నావు. నవయువకుల్లారా! మీరంతా సత్యం గ్రహించండి.. జగన్ అనే వ్యక్తి కరుడుగట్టిన నేరస్థుడు. వారి కుటుంబం నేరాలు, ఘోరాలు చేసిన కుటుంబం. వారి సంపాదనంతా అక్రమమే. వారి రాజకీయ చరిత్ర అంతా రక్తంతో కూడుకున్నదే’ అని స్పష్టం చేశారు.
గొంతుకోసి చంపినా కేసుల్లేవు..
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరుకుల కులానికి చెందిన మహేశ్ అనే వ్యక్తిని చుట్టుముట్టి గొంతుకోశారని.. కేసు రిజిస్టర్ కాకపోవడం వెనుక జగన్ హస్తం ఉందని పార్థసారథిరెడ్డి అన్నారు. మహేశ్ తమ్ముడి కొడుకులు ఇద్దరినీ గొంతుకోసి చంపితే ఎఫ్‌ఐఆర్ లేదన్నారు. 2003-04లో కడప సెషన్స్ కోర్టులో రాజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి హత్య కేసుల విచారణ జరుగుతుంటే తన పక్కన సూట్‌కేసు బాంబు పెట్టించిన ఘనుడు జగనేనన్నారు. తనతో పాటు పరిటాల రవి హత్యకు మద్దెల చెరువు సూరితో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. దీనిపై జగన్ అనుచరుడు మంగలికృష్ణపై కేసు నమోదైందని.. జగన్‌ను తప్పించారని వెల్లడించారు. పరిటాల రవి హత్య సూత్రధారులు జగన్, ఆయన తండ్రేనని.. వైఎస్ సీఎంగా ఉండడం తో ఆ కేసు నుంచి జగన్ తప్పించుకున్నాడని చెప్పారు. నాటి సీఎం చంద్రబాబు విధానాలతో 1998 తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైపోయిందని.. పులివెందులలోనే 2500మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మారారన్నారు. ఈరోజు పులివెందులలో కత్తి పట్టేవాడు.. తుపాకీ పట్టేవాడు ఒక్కరూ లేరని.. జగన్‌తో కలిస్తే మీ పూర్వీకుల్లా కత్తికి బలవుతారని.. కుటుంబ పెద్దలను కోల్పోయి.. మాంగల్యాలు పోగొట్టుకుని మహిళలు ఎన్నో బాధలు పడ్డారని.. ఆ పరిస్థితి ప్రస్తుత తరానికి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.