జగన్‌వి డైవర్షన్ రాజకీయాలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:02 AM
జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మావిగన్ అంశం ట్రోల్ కావటంతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నాలు చేశారు...
మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకోవడానికే ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు: బుద్దా
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మావిగన్ అంశం ట్రోల్ కావటంతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నాలు చేశారు’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి ప్రయత్నించి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై విమర్శలు చేస్తున్నారు. వారికి, ఆంధ్రజ్యోతికి సంబంధం ఏమిటి? రాధాకృష్ణపై దాడి చేస్తాను, అరెస్టు చేస్తానని జగన్ బెదిరిస్తాడా? జగన్ పత్రికలో రాసిన నీచపు రాతలకు ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్టులు చేయాలి? విజయమ్మ, జగన్ గురించి లేఖ రాస్తే కనీసం ఆ పత్రికలో రాశారా? అమరావతి మహిళలు వేశ్యలు అని రాస్తే... నాడు భారతీరెడ్డి అమరావతి మహిళలకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా? పాదయాత్ర చేసి చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్ అనడం హాస్యాస్పదం. ఇప్పటికే లోకేశ్ తన పాదయాత్ర ద్వారా జగన్‌కు సినిమా చూపించారు’’ అని ఎద్దేవాచేశారు.