టీడీపీ నేతపై వైసీపీ మూకల దాడి
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:12 AM
పల్నాడు జిల్లా గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బత్తుల ఏడుకొండలుపై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు.
గురజాల మండలంలో కాపుకాచి.. గొడ్డళ్లు, రాడ్లతో దాడి
గురజాల టౌన్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత బత్తుల ఏడుకొండలుపై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం పులిపాడు - దైద గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ఏడుకొండలు బుధవారం గురజాల పట్టణానికి వచ్చి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా.. వైసీపీ మూకలు ఆయనపై గొడ్డళ్లు, రాడ్లతో దాడి చేశాయి. సమీప పొలాల్లో ఉన్న రైతులు.. అది చూసి.. కేకలు వేస్తూ రావడంతో వైసీపీ మూకలు అక్కడి నుంచి పరారయ్యాయి. ఏడుకొండలు రెండు కాళ్లూ విరిగిపోగా ఎడమ చేయి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108లో పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన చల్లా చిన్న గురువులు, ప్రేమ్‌కుమార్, బత్తుల శ్రీనివాసరావు, చల్లా ఆంజనేయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గురజాల పోలీసులు గాలింపు చేపట్టారు. గ్రామంలో ఏడుకొండలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున కక్ష పెంచుకున్న వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వైసీపీ హయాంలో, కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతలు దాడులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.. వీరిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.