టీడీపీతోనే మత సామరస్యం సాధ్యం
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:25 AM
మతసామరస్యాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని ప్రభుత్వ సలహాదారు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు.
ప్రభుత్వ సలహాదారు షరీఫ్
అనంతపురం క్రైం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): మతసామరస్యాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని ప్రభుత్వ సలహాదారు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ లౌకిక పార్టీ అని, టీడీపీతోనే మతసామరస్యం సాధ్యమని అన్నారు. హైదరాబాద్‌లో మతకల్లోలాలను అరికట్టిన నాయకుడు ఎన్టీ రామారావు అని చెప్పారు. రాష్ట్ర హితం కోసం బీజేపీతో జత కట్టడాన్ని కూడా తప్పుపట్టి, మైనార్టీల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. సీబీఐ కేసుల్లో కోర్టులకు వెళ్లకుండా జగన్ జారుకుంటున్నారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.