Share News

గల్ఫ్‌లో టీడీపీ తమ్ముళ్ల పోరు

ABN , Publish Date - May 23 , 2026 | 06:25 AM

తెలుగుదేశం పార్టీలోని వర్గవిభేదాలు దేశం దాటేశాయి. గల్ఫ్‌ దేశాల్లో ఆ పార్టీ నేతల మధ్య ఐకమత్యం జాడే లేదు. పరస్పరం కొట్లాడుకుంటున్నారు. ముఖముఖాలు కూడా చూసుకోనంత బద్ధవైరుల్లా ప్రవర్తిస్తున్నారు.

గల్ఫ్‌లో టీడీపీ తమ్ముళ్ల పోరు

  • అక్కడకూ పాకిన విభేదాలు, అనైక్యత

  • ఎవరికి వారుగా పోటాపోటీ కార్యక్రమాలు

  • ఏపీ నుంచీ వేర్వేరుగా నేతల హాజరు.. కార్యకర్తల్లో గందరగోళం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీలోని వర్గవిభేదాలు దేశం దాటేశాయి. గల్ఫ్‌ దేశాల్లో ఆ పార్టీ నేతల మధ్య ఐకమత్యం జాడే లేదు. పరస్పరం కొట్లాడుకుంటున్నారు. ముఖముఖాలు కూడా చూసుకోనంత బద్ధవైరుల్లా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. జెండాలు ఎగురవేస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంటోంది. ఈ వ్యవహారాలు చివరకు పోలీసుల వరకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న పార్టీ నాయకులు కూడా ఆయా వర్గాలకు అనుకూలంగా ఉంటూ వారి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఓ నాయకుడు తరచూ పశ్చిమాసియా వచ్చి వర్గాలను ప్రోత్సహిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రవాసాంధ్రుల నేతలమని చెప్పుకొనే ముఖ్యనాయకులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక నాయకులను సైతం కలవడం లేదు. విదేశాల నుంచి వచ్చే టీడీపీ నేతలతో భేటీ కావడానికి కూడా ఓ ప్రవాసీ పెద్ద నేత విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కీలకమైన గల్ఫ్‌ ప్రాంతాన్ని పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. అమెరికా నేతలకు పెద్దపీట వేస్తోందన్న విమర్శలున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్‌ విధానంలో మహానాడు జరుగనున్న సంగతి తెలిసిందే. దీనికిముందుగా అన్ని జిల్లాల్లో మినీమహానాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాల్లో కూడా టీడీపీ నేతలు మహానాడు జరుపుతున్నారు. శుక్రవారం ఖతార్‌లో ఓ వర్గం నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి హాజరు కాగా.. మరో వర్గం జరిపిన వేడుకల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పాల్గొన్నారు.


ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు ఒకే సమయంలో జరగడం గమనార్హం. పైగా అవతలి సభను అడ్డుకోవడానికి మరో వర్గం చివరి వరకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కువైత్‌లో గత శుక్రవారం జరిగిన మహానాడులో మాజీ మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు పాల్గొన్నారు. ఈ శుక్రవారం మరో వర్గం నిర్వహించిన మహానాడులో పాల్గొనడానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ‘మహాసేన’ రాజేశ్‌ అక్కడకు చేరుకున్నారు. కానీ ఆఖరు నిమిషంలో కార్యక్రమం రద్దయింది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ మరో వర్గానికి చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ దీనిని అడ్డుకున్నట్లు తెలిసింది. గల్ఫ్‌లో ఏపీకి చెందిన వారు సుమారు 5 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. వీరిలో అత్యధికులు ఉభయ ఉమ్మడి గోదావరి, రాయలసీమ జిల్లాలకు చెందినవారు. జగన్‌కు గట్టిమద్దతుదారులుగా ఉన్న వర్గాలవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రవాస టీడీపీ నేతలు వీరిని తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేయడానికి బదులు పరస్పర విభేదాలతో అభాసుపాలవుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ నేతల్లో అత్యధికులు సొంత నియోజకవర్గాల్లో పార్టీకి గానీ, ప్రజలకు గానీ ఏమీ చేయలేదని అంటున్నారు. నాయకత్వం జూమ్‌ మీటింగులను ప్రామాణికంగా తీసుకోవడంతో మరింత గందరగోళం ఏర్పడుతోందని చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో నూతన కార్యవర్గాల నియామకం ఇంకా చేపట్టలేదు. ఈ ప్రక్రియలో బాగా జాప్యం జరుగుతోంది. మలయాళీల తరహాలో పార్టీని బలోపేతం చేసుకోకుండా.. దానిని కులసంఘంలా భావిస్తూ.. ఆధిపత్యం ప్రదర్శిస్తుండడంతో టీడీపీకి రాజకీయంగా నష్టం వాటిల్లుతోందని.. నాయకత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - May 23 , 2026 | 06:26 AM