Share News

ఆలూరులో టీడీపీ పట్టు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:37 PM

ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ తన పట్టును మరింత బిగించింది.

   ఆలూరులో టీడీపీ పట్టు
టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతిని సన్మానిస్తున్న దేవనకొండ జెడ్పీటీసీ డా.సాదిక, టీడీపీ నాయకులు

ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థుల ఖరారు

66 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం

ఎమ్మెల్యే విరుపాక్షి సొంత మండలంలోనూ టీడీపీ ఆధిపత్యం

ఈనెల 19న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం

ఆలూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో టీడీపీ తన పట్టును మరింత బిగించింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార కూటమికి అనుకూలంగా రావడంతో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో నూతనో త్సాహం నెలకొంది. ఆరు మండలాల్లో 66 ఎంపీటీసీ స్థానాలను కూటమి పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి సొంత మండలంలోనూ జడ్పీటీసీతో పాటు ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే ఆరు మండలాలకు..

నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఎంపీపీ పీఠాలను కూమి ఖాతాలో వేసుకునే దిశగా టీడీపీ పావులు కదుపుతోంది. ఈనెల 19న జరగనున్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆరు మండలాలకు ఎంపీపీ అభ్యర్థులను వైకుంఠం జ్యోతి ఖరారు చేసినట్లు సమాచారం. ఆలూరు మండలానికి తనయుడు వైకుంఠం సాయి శ్రీరామ్‌, చిప్పగిరికి మీనాక్షినాయుడు, ఆస్పరికి కృష్ణయాదవ్‌, హాలహర్వికి గుమ్మనూరు గిరిజ, దేవనకొండకు ఈడిగ లక్ష్మి, హొళగుందకు జయలక్ష్మి పేర్లను ప్రకటించారు.

ఆశావహుల హడావుడి

ఎంపీపీ అభ్యర్థుల ఖరారుతో ఇప్పడు వైస్‌ ఎంపీపీ పదవులపై రాజకీయ వేడి మొదలైంది. కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీటీసీలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. సామాజికవర్గాలవారీగా తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతిని కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఆరు మండలాల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపికపైనా మైనారిటీ వర్గాల నాయకుల్లో ఆశలు పెరిగాయి. ఈపదవుల కేటాయింపు పార్టీ నాయకత్వానికి మరో రాజకీయ పరీక్షగా మారనుంది.

జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమి హవా

ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, దేవనకొండ మండలాల జడ్పీటీసీ స్థానాలను సైతం కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో టీడీపీ బలం స్పష్టమైంది. ఒకవైపు ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యం, మరోవైపు జడ్పీటీసీ విజయాలతో స్థానిక సంస్థలపై పట్టు సాధించిన టీడీపీ, ఇప్పుడు మండల పరిషత్‌ పాలనలోనూ తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.

జడ్పీ చైర్మన్‌ పదవి కోసం..

ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల జడ్పీటీసీ డాక్టర్‌ షేక్‌ సాదికకు ఇప్పించుకునేందుకు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి విజయవాడలో మకాం వేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన సాదికకు జెడ్పీ పీఠాన్ని కట్టబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అభివృద్ధికి పట్టం కట్టారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతాం. స్థానిక సంస్థల ఎన్నికలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు టీడీపీకి అనుకూలంగా మారాయి. ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో వైస్‌ ఎంపీపీ, కో-ఆప్షన్‌ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఫ వైకుంఠం జ్యోతి, టీడీపీ ఇన్‌చార్జి, ఆలూరు

Updated Date - Nov 10 , 2026 | 11:37 PM