Share News

Revenue Staff Complaints: టీడీపీని తాకిన ‘భూ’ కంపం

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:51 AM

జగన్‌ ప్రభుత్వం ఆనాడు రీసర్వే పేరుతో సృష్టించిన భూ వివాదాల సునామీ గ్రామాలను కుదిపేస్తోంది.

Revenue Staff Complaints: టీడీపీని తాకిన ‘భూ’ కంపం

  • పార్టీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుల వెల్లువ.. భూ సమస్యలపై బాధితుల గోడు

  • స్వయంగా అనగానికే పిటిషన్లు

  • క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై అత్యధికంగా ఫిర్యాదులు

  • ప్రభుత్వమే పరిష్కరించాలంటూ అభ్యర్థన

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం ఆనాడు రీసర్వే పేరుతో సృష్టించిన భూ వివాదాల సునామీ గ్రామాలను కుదిపేస్తోంది. ఈ వివాదాల పరిష్కారంపై కూటమి సర్కారు ఏటూ తేల్చడం లేదు. తెలుగునేలపై రీసర్వే తర్వాత ఎలాంటి వివాదాలు, సమస్యలు వస్తున్నాయో తెలియజేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కొద్దిరోజులుగా వరుసగా వార్తలు ప్రచురిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని సమస్యలన్నీ పరిష్కరించాలని రెవెన్యూశాఖను ఆదేశిస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూశాఖ చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని బుధవారం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సాక్షిగా నిరూపితమయింది. రొటేషన్‌లో భాగంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బుధవారం ప్రజా గ్రీవెన్స్‌ సెల్‌లో కూర్చున్నారు. భూ సమస్యల బాధితులు అక్కడికి భారీగా వచ్చి మంత్రిని కలిసి పరిష్కారం కోరారు. ఇలా గతంలోనూ అనేక ద ఫాలుగా పిటిషన్లు తీసుకున్నారు. కానీ ఈసారి మంత్రే ఆశ్చర్యపోయేలా బాధితులు భారీ ఎత్తున అర్జీలు ఇచ్చారు. దీన్నిబట్టి గ్రామీణ ప్రాంతా ల్లో రీసర్వే 1.0 అనంతర సమస్యలు ఎంతగా పాతుకుపోయాయో స్పష్టమవుతోంది.


మంత్రి దృష్టికి వచ్చిన అంశాలు..

  • సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణ స్వామి తన భూమిని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్‌ 103-1-ఏ1లోని 75 సెంట్ల మెట్టభూమిని అధికారుల సహకారంతో వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని తన ఫిర్యాదులో ఏర్కొన్నారు.

  • అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బ గ్రామానికి చెందిన రైతు నాగరాజు తన భూమిని గుర్తించి అప్పగించాలని కోరారు. స్థానిక వైసీపీ నేతలు భూములను ఆక్రమించుకొని భూమిపై పొజిషన్‌ చూపకుండా, హద్దులు నిర్ధారించకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

  • అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటకు చెందిన సురేంద్రబాబు పిటిషన్‌ ఇచ్చారు. గ్రామంలో సర్వే నం. 847-1లోని భూమిని 2023-2026 కాలానికి వేలంలో పాడుకున్నా, ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు భూమిని చూపించలేదని పేర్కొన్నారు. తక్షణమే భూములను పొజిషన్‌లో చూపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

  • పశ్చిమగోదావరి జిల్లా ఇనపర్రు గ్రామానికి చెదిన కర్రి గోపిరెడ్డి రిటైర్డ్‌ ఎయిర్‌ఫోర్స్‌ జవాను. 1999లో నాటి ప్రభుత్వం ఆయనకు సర్వే నం.194-3లో 3 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసిన తర్వాత 2019లో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన భూమిలో చెరువును తవ్వింది. మరో చోట భూమి ఇస్తామన్నా ఇప్పటికీ కేటాయించలేదు.

  • ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శివన్నపాలెం గ్రామానికి చెందిన రామకృష్ణ భూమిని గత ప్రభుత్వంలో రికార్డుల్లో తారుమారు చేశారు. నాటి రెవెన్యూ, సర్వే అధికారులు అక్రమార్కులతో కొమ్ముకాసి తన భూమిని మరొకరి పేరుపై రాశారని బాధితుడు చెప్పారు.

  • నంద్యాలకు చెందిన చెన్నమ్మ ఓ వినతి ఇచ్చారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామం, కడమల, తిమ్మాపురం పరిధిలో దాదాపు 500 ఎకరాల అటవీ భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్‌, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో చెన్నమ్మ పేర్కొన్నారు.


పరిష్కారం చూపెడతారా?

టీడీపీ గ్రీవెన్స్‌లో మంత్రిని కలిసి సమస్యను చెప్పుకున్నవారు చెప్పిన దాంట్లో ఒక ఉమ్మడి అంశం ఉంది. స్ధానిక వీఆర్‌వో, సర్వేయర్‌ తమకు అన్యాయం చేశారని అందరూ ఫిర్యాదు చేశారు. ఇక తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు స్థానిక తహసీల్దార్‌, ఆర్‌డీవోను కలిసి అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనీసం పట్టించుకోలేదనేది మరో ప్రధాన ఫిర్యాదు. అంటే, బాధితులను గ్రామస్థాయిలో మోసం చేశారు. మండల, డివిజన్‌ స్థాయిలో పట్టించుకోలేదు. అందుకే నేరుగా మంత్రి ఉన్న దగ్గరికే వచ్చి తమ గోడు చెప్పుకొన్నారు. మరి ఈ దఫా అయినా వారి సమస్యకు పరిష్కారం చూపెడతారా? లేక మిగతా పిటిషన్ల మాదిరిగా వీటిని కూడా పరిష్కరించేసిన జాబితాలో కలిపేస్తారా?అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 08 , 2026 | 05:52 AM