రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులు ఖరారు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:33 AM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్ పేరును ఖరారు చేయడం, ఆయన నామినేషన్ దాఖలుచేయడం పూర్తయింది.
సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, విజయ్‌కు చాన్స్
రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన నుంచి లింగమనేని రమేశ్ పేరును ఖరారు చేయడం, ఆయన నామినేషన్ దాఖలుచేయడం పూర్తయింది. టీడీపీ నుంచి సానా సతీశ్, భాష్యం రామకృష్ణ పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా మూడో అభ్యర్థిగా చింతకాయల విజయ్ పేరును ప్రకటించారు. దీంతో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. విజయ్ పేరుతోపాటు సీనియర్ నేత వర్ల రామయ్య పేరును చివరివరకు పరిశీలించిన చంద్రాబాబు చివరకు విజయ్ వైపు మొగ్గారు. సతీశ్, రామకృష్ణ ఇద్దరూ కోస్తా ప్రాంతానికి చెందినవారు కావడం.. వర్ల కూడా ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తరాంధ్రకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతోపాటు యువత, బీసీలకు ప్రాధాన్యమిచ్చే క్రమంలో విజయ్‌వైపు పార్టీ మొగ్గు చూపింది. సతీశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నది ఏడాదిన్నర మాత్రమే కావడం, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయన పేరును ఖరారు చేసింది. జనసేన నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన రమేశ్‌కు టికెట్ ఇవ్వడం సతీశ్‌కు కలిసొచ్చింది. రామకృష్ణ పేరు ఖరారులో పార్టీకి విధేయత కీలకపాత్ర పోషించింది. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించిన ఆయనకు చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. అయినప్పటికీ పార్టీకి నమ్మినబంటుగా పనిచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించారు. అభ్యర్థిత్వాలు దక్కిన ముగ్గురినీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. వారికి సీట్లు ఎందుకు ఇచ్చామో చెబుతూ.. ఢిల్లీలో రాష్ట్రానికి ఎలాంటి సేవ చేయాలో దిశానిర్దేశం చేశారు. వారికి బీఫారాలిచ్చారు. సోమవారం వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
చింతకాయల విజయ్..
ఉత్తరాంధ్రలోని నర్సీపట్నానికి చెందిన విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. బీటెక్ చదివిన విజయ్ వాషింగ్టన్‌లోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు. 2009 నుంచి టీడీపీలో చురుగ్గా ఉన్నారు.
భాష్యం రామకృష్ణ..
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.. పల్నాడు జిల్లా ఎనికపాడుకు చెందినవారు. బీఎస్సీ, బీఈడీ చేసిన ఈయన భాష్యం విద్యాసంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. తొలినుంచీ టీడీపీ సానుభూతిపరుడు. 2024లో గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. ఓ దశలో ఏలూరు లోక్‌సభ స్థానం ఇచ్చినా పోటీకి సిద్ధపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తామని అప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే అవకాశమిచ్చారు.
సానా సతీశ్..
వ్యాపారవేత్తగా సుపరిచితుడైన సతీశ్.. కాకినాడ రూరల్ మండలం తమ్మవరానికి చెందినవారు. కాకినాడలో సానా సతీశ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2024లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానానికి జనసేనకు కేటాయించడంతో అవకాశం దక్కలేదు. 2024 డిసెంబరులో జరిగిన ఉపఎన్నికలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగడంతో.. ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు.
సరైన సమయంలో గుర్తింపు: పల్లా
రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వర్ల రామయ్య, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు, టీడీ జనార్దన్‌ను టీడీపీ నాయకత్వం బుజ్జగించింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారికి ఫోన్లు చేశారు. ఏ పరిస్థితుల్లో అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారో వివరించారు. ఆయన నిర్ణయాన్ని శిరసావహించాలని.. సరైన సమయంలో తగిన గుర్తింపు తప్పక ఇస్తారని హామీ ఇచ్చారు.