Share News

3 రోజులా? 2 రోజులకు కుదింపా?

ABN , Publish Date - May 15 , 2026 | 03:58 AM

మహానాడు నిర్వహణపై టీడీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ వద్ద జరిగిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో మహానాడు నిర్వహణపై చర్చ జరిగింది.

3 రోజులా? 2 రోజులకు కుదింపా?

  • టీడీపీ మహానాడుపై తర్జనభర్జన

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): మహానాడు నిర్వహణపై టీడీపీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ వద్ద జరిగిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో మహానాడు నిర్వహణపై చర్చ జరిగింది. ప్రభుత్వం ఓ వైపు పొదుపు చర్యలు ప్రకటిస్తూ, మరోవైపు భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మహానాడును పూర్తిగా రద్దు చేయడం కాకుండా రెండు రోజులకు కుదిస్తే బాగుంటుందని మరికొందరు మంత్రులు సూచించారు. మహానాడు.. పార్టీ సంస్థాగత కార్యక్రమం కాబట్టి, కార్యకర్తల్లో నాయకుల్లో జోష్‌ నింపాలంటే తప్పకుండా నిర్వహించాల్సిందేనని, అయితే భారీ వ్యయంతో ముడిపడిన బహిరంగ సభను రద్దు చేసుకుంటే బాగుంటుందన్న సూచనలు వచ్చాయి. మంత్రులందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత లోకేశ్‌ దీనిపై స్పందించారు. ‘‘పార్టీ పెద్దలందరితో మాట్లాడి, పార్టీ వ్యూహాత్మక కమిటీలోనూ చర్చించి, చంద్రబాబు సూచనల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుందాం’’ అని అన్నారు. స్థానిక ఎన్నికలపైనా చర్చ జరిగింది.

పయ్యావుల జన్మదిన వేడుకలు

ఉండవల్లిలో సహచర మంత్రులతో లోకేశ్‌ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ జన్మదిన వేడుకలను కేక్‌ కట్‌ చేసి ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేశవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - May 15 , 2026 | 04:00 AM