ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రచ్చ!
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:53 AM
రాజధానిలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాని మాటున కులచిచ్చుకు యత్నం
నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు
అయినా 1,750 కోట్లు దుర్వినియోగమంటూవైసీపీ నేతల అసత్య ఆరోపణలు
నాడు పోలవరం పూర్తి కాకుండానే..భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం
విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం
వీటిని జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయం
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాజధానిలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని కులాలకు ఆపాదిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా బృందం ఇంతటితో ఆగకుండా వైసీపీ నేతలనూ రంగంలోకి దించి రెచ్చగొట్టేలా మాట్లాడిస్తోందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ‘గుజరాత్ ప్రైడ్’ పేరుతో ఆ రాష్ట్రంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ‘ఏకతా విగ్రహం (స్ట్టాట్యూ ఆప్ యూనిటీ)’ పేరుతో ఏర్పాటు చేసి పర్యాటకంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. అదే తరహాలో అమరావతిలో ‘తెలుగు ప్రైడ్’ థీమ్‌తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే దీనికి నిధులు ఎలా సమీకరించాలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈలోగానే వైసీపీ ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1,750 కోట్లు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించింది. నీరుకొండలో ఆ విగ్రహం ఏర్పాటు చేయడమంటే.. దళితులను కించపరచడమేనని ఆ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని పీపీపీ పద్ధతిన ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎక్కువ శాతం నిధులను సమీకరించి ప్రభుత్వ భాగస్వామ్యం వీలైనంత తక్కువగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం చెంతనే ఆహ్లాదకమైన పార్కు, పర్యాటకాన్ని ఆకర్షించేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ప్యూచర్ మ్యూజియం వంటివి ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని స్వయంగా నీరుకొండ గ్రామస్థులే ప్రభుత్వాన్ని కోరుతుండగా.. వైసీపీ నాయకులు అందుకు భిన్నంగా దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం. నిత్యం కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా బృందం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మధ్యలో భారీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే నిర్మాణం పూర్తికాకుండానే విగ్రహం ఏర్పాటు ఏమిటన్న విమర్శలతో వెనక్కి తగ్గింది. వీటిని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.