Share News

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జిగా వర్మ తొలగింపు

ABN , Publish Date - May 08 , 2026 | 04:31 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఎస్వీఎస్‌ వర్మను తొలగిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జిగా వర్మ తొలగింపు

  • త్రీమెన్‌ కమిటీకి బాధ్యతలు..

  • పార్టీ, లోకేశ్‌ నన్ను సంప్రదించే నిర్ణయం తీసుకున్నారు

  • ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు

  • భావోద్వేగానికి గురైన వర్మ

అమరావతి, పిఠాపురం, మే 7(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఎస్వీఎస్‌ వర్మను తొలగిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. గురువారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. వర్మకు ఫోన్‌ చేసి అధిష్ఠానం నిర్ణయాన్ని తెలియజేశారు. కూటమి ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. ‘పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీని నష్టపరిచే చర్యలను నేను సహించలేకపోయాను. అంతేతప్ప నాకు కూటమిలోని పార్టీలతో ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా’ అని వర్మ, పల్లాకు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పిఠాపురంలో జనసేన నాయకులు, వర్మకు నడుమ తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు దీన్ని సీరియ్‌సగా తీసుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. వర్మ స్థానంలో నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను త్రీమెన్‌ కమిటీకి అప్పగించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. త్వరలోనే త్రీమెన్‌ కమిటీని నియమిస్తామని పల్లా తెలిపారు. దీనిపై వర్మ మీడియాతో మాట్లాడారు. ‘పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదు. పార్టీ బలోపేతం కోసమే నిరంతరం శ్రమించా. అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. వర్మ అంటో ఏంటో పిఠాపురం ప్రజలకు, పార్టీకి తెలుసు. పార్టీ నాయకత్వంతోపాటు జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌తో సమావేశమై పార్టీకి సంబంధించిన పలు విషయాలను మాట్లాడా. ఆ సమయంలోనే సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పా. టైమ్‌ స్పెండ్‌ చేయడం ఇబ్బందిగా ఉందని, ఒక్కడినే పనిచేయలేకపోతున్నానని వివరించా. పార్టీ, లోకేశ్‌ నన్ను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారమే పార్టీ ప్రకటన వచ్చింది.


బయట వంద అనుకుంటారు. అవి నాకు అనవసరం. సీటు విషయం అంటారా... కూటమిలో ఎవరో ఒకరికి నష్టం తప్పదు. 20-30 సీట్లలో ఇలా ఎక్కడ జరిగినా అందరూ పార్టీకి సపోర్టు చేశారు. జగన్‌ రాకూడదంటే ఎవరో ఒకరు త్యాగం చేయకతప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విలేకరులు... ప్రస్తుతం పార్టీ తీసుకున్న నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా? అని అడిగిన ప్రశ్నతో వర్మ భావోద్వేగానికి గురయ్యారు. కొంత సమయం మాట్లాడలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. పిఠాపురం టీడీపీ, అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని చెబుతూ భావోద్వేగంతో ఇక మాట్లాడలేక లేచి వెళ్లిపోయారు.

Updated Date - May 08 , 2026 | 04:31 AM