11న 11 మందీ అసెంబ్లీకి రండి
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:41 AM
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులకు దక్కుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు.
కల్తీ నెయ్యిపై సభలో చర్చిద్దాం.. కలియుగ దైవాన్ని మోసం చేశారు
ఆ ఘనత జగన్, వైసీపీ నేతలదే.. పాలు లేకుండానే నెయ్యి తయారీ
ఆధారాలతో దొరికినా దబాయింపు.. కల్తీ చేశారని సిట్ తేల్చినా అబద్ధాలు
జగన్‌ను ప్రజలు నిలదీయాలి: టీడీపీ
పార్వతీపురం/ఒంగోలు కార్పొరేషన్/అనంతపురం క్రైం/తిరుపతి(రవాణా), జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని మోసం చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులకు దక్కుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. ప్రజా సమస్యలు, తిరుపతి లడ్డూ తయారీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులపై చర్చించేందుకు దమ్ముంటే జగన్మోహన్‌రెడ్డి సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే నెల 11వ తేదీ ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కుశ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పాలు లేకుండా రసాయన పదార్థాలతో నెయ్యి తయారు చేసి వెంకటేశ్వరస్వామిని జగన్‌తో పాటు వైసీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. ఆధారాలతో దొరికిపోయినా వైసీపీ నాయకులు దబాయింపు ప్రారంభించారని ఆమె మండిపడ్డారు. కల్తీ నెయ్యిపై వైసీపీ నేతలు రోజుకో మాట, పూటకో కథ చెబుతూ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఒంగోలులో అన్నారు. జంతువుల కొవ్వును ఉపయోగించి నెయ్యి పేరుతో భారీగా దోచేశారన్నారు. హిందువుల మనోభావాలపై దాడి చేసిన జగన్‌ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని టీటీడీ సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో పిలుపునిచ్చారు. జగన్‌కు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారని ప్రశ్నించారు. దేవదేవున్ని నల్లరాయి, అవసరమైతే పెకలిస్తామని మాట్లాడిన నాస్తికుడు కరుణాకర్‌రెడ్డి అని మండిపడ్డారు. ఏ తప్పూ చేయకుంటే సుబ్బారెడ్డి భార్య బ్యాంకు ఖాతాల వివరాలను ఎందుకు ఇవ్వలేదని, ఎందుకు కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కాసులకు కక్కుర్తి పడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో అన్నారు. 10 శాతం కన్నా తక్కువ వివిధ జంతువుల కొవ్వులు కలిపి ఉంటే వాటిని గుర్తించలేమని సిట్ ఇచ్చిన రిపోర్టులో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు ఎక్కడా జంతువుల కొవ్వు కలపలేదంటూ సిట్ నివేదిక ఇచ్చిందని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.