టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:13 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగనున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగింపు
పొలిట్‌బ్యూరోలో 29 మందికి చోటు
జాతీయ కమిటీలో 31.. రాష్ట్ర కమిటీలో 185 మంది
అన్ని కమిటీల్లో మహిళలకు పెద్దపీట.. 24శాతం పదవులు
రాష్ట్ర కమిటీలో 40శాతం బీసీలు, 25శాతం ఎస్సీలకు స్థానం
ఎస్టీలకు 3.8శాతం, మైనారిటీలకు 7శాతం అవకాశం
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగనున్నారు. గత మహానాడులో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైన విషయం తెలిసిందే. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావునే కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను బుధవారం ప్రకటించారు. 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీలో... జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించారు. రాష్ట్ర కమిటీలో.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 14 మంది, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లుగా 10 మంది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మంది, రాష్ట్ర కార్యదర్శులుగా 77 మందిని నియమించారు.
నాలెడ్జి కమిటీ, హెచ్‌ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు. పొలిట్‌బ్యూరోలో ఐదుగురు మహిళలకు, జాతీయ కమిటీలో ముగ్గురు మహిళలకు, రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు దక్కింది. మొత్తం 24 శాతం పదవులను మహిళలకు కేటాయించారు. అలాగే యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. జనాభా దామాషా పద్ధతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఏకంగా 122 మంది బడుగులకు స్థానం కల్పించారు. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాతం చొప్పున కమిటీలో అవకాశం కల్పించారు.