Share News

సానాకు మళ్లీ చాన్స్‌!

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:50 AM

రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారెవరు! జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక... తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

సానాకు మళ్లీ చాన్స్‌!

  • మరో అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ.. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై తుది దశకు చేరిన కసరత్తు

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు వెళ్లే వారెవరు! జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. ఇక... తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్‌కు మరో అవకాశం దక్కడం దాదాపు ఖరారైంది. విద్యాసంస్థల అధిపతి ‘భాష్యం’ రామకృష్ణనూ పెద్దల సభకు పంపనున్నట్లు తెలిసింది. ఇక మూడో అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఉత్కంఠ నెలకొంది. బీసీ వర్గం నుంచి ఎంపిక చేసేట్లయితే స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కి... ఎస్సీ వర్గ నేతను ఎంపిక చేస్తే సీనియర్‌ నేత వర్ల రామయ్యకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.

సానాకు మళ్లీ ఎందుకంటే...

గతంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సానా సతీశ్‌ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన పదవీ కాలం ఏడాదిన్నర మాత్రమే ఉంది. దీంతో.. ఆయనకు మళ్లీ అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఇందులో సామాజిక వర్గాల కోణమూ ఉంది. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తోంది. జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేశ్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక.. టీడీపీ కాపులకు ప్రాతినిధ్యం కల్పించకపోతే, దాన్ని వైసీపీ అవకాశంగా తీసుకుని, వారిని రెచ్చగొట్టేందుకు సిద్ధంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీశ్‌ను ఎంపిక చేస్తే... వైసీపీకి ఆ అవకాశం ఉండదు. పైగా... ఏడాదిన్నర మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు మరోసారి అవకాశమివ్వడం న్యాయమని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.

పార్టీకి విధేయుడిగా భాష్యం

అధికారంలో ఉన్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ సేవ చేస్తున్న భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ టికెట్‌ ఆశించారు. ఒక దశలో... ఏలూరు ఎంపీ బరిలో ఆయనను నిలపాలని భావించారు. కానీ.. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని అప్పుడే ఆయనకు హామీ లభించింది. వివాద రహితుడిగా పేరున్న భాష్యం రామకృష్ణను ఎంపిక చేయడం ద్వారా... పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేశామనే సంకేతమూ వెళుతుందని టీడీపీ చెబుతోంది.


మూడో స్థానం ఎవరికి...

బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ తొలి నుంచీ అనుసరిస్తున్న విధానం! దీంతో మూడు స్థానాల్లో ఒకటి బీసీ లేదా ఎస్సీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. రాజకీయాల్లోలేని, పక్క రాష్ట్రానికి చెందిన వారి పేర్లూ పరిశీలనకు వచ్చాయి. అయితే... ఏపీలో ఉండి, ఏపీలో పార్టీకి సేవ చేసే వారికే అవకాశమివ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌... ఐ-టీడీపీ సారథిగా కీలక పాత్ర పోషించారు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ దాడిని గట్టిగా ఎదుర్కొన్నారు. అయన్నపాత్రుడు మంత్రి పదవి ఆశించినప్పటికీ.. పార్టీ ఆదేశం మేరకు స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్రలో ఆ కుటుంబానికి ఉన్న పేరును పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్‌ని రాజ్యసభకు పంపించాలని చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం, వర్ల రామయ్యకే చాన్స్‌ లభిస్తుంది. ఆయన పార్టీలో సీనియర్‌ నేత. గతంలో... ఓటమి తప్పదని తెలిసీ పార్టీ ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారు. చింతకాయల విజయ్‌ యువకుడు. రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంది. వర్ల రామయ్య వయసు రీత్యా పెద్ద. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వర్ల రామయ్యకే అవకాశమివ్వడం సరైనదనే కోణంలో చర్చ జరుగుతోంది. వర్లను ఎంపిక చేసి, విజయ్‌కి భవిష్యత్తులో తగిన అవకాశం ఇస్తామని అయ్యన్నపాత్రుడుకి సర్దిచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన పార్టీతో, పవన్‌ కల్యాణ్‌తో 2015 నుంచి లింగమనేనికి అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగిన సోషల్‌ ఇంజనీరింగ్‌ అవసరమన్నది అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మనోగతం. దానికి ఆకర్షితులైన రమేశ్‌ సుదీర్ఘకాలం నుంచి వెన్నంటి ఉన్నారు. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటేడ్‌ పదవుల్లో అవకాశం ఇచ్చారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ అధినేత పరిగణనలోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం రమేశ్‌ నామినేషన్‌ వేస్తారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పవన్‌ కల్యాణ్‌కు, రమేశ్‌ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘నాకు ఇచ్చింది పదవి కాదు. బలమైన బాధ్యత. ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తా.’ అని తెలిపారు.

Updated Date - Jun 06 , 2026 | 05:50 AM