Share News

టీమ్‌ 2029!

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:33 AM

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం 2029 ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసింది. పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పొలిట్‌బ్యూరోలో సీనియర్లకు ఎక్కువగా అవకాశం కల్పించగా..

టీమ్‌ 2029!

  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా టీడీపీ కమిటీల కూర్పు

  • ‘విధాన’ కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యం

  • క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించాల్సిన కమిటీల్లో యువతకు అన్ని కమిటీల్లో మహిళలకు పెద్దపీట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం 2029 ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసింది. పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే పొలిట్‌బ్యూరోలో సీనియర్లకు ఎక్కువగా అవకాశం కల్పించగా.. క్షేత్రస్థాయిలో పార్టీని ముందుండి నడిపించాల్సిన జాతీయ, రాష్ట్ర కమిటీల్లో యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే కొత్తవారికీ అవకాశాలు కల్పించింది. అదేవిధంగా పార్టీ కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేశారు. భవిష్యత్తులో పార్టీకి అవసరమైన సైన్యాన్ని సిద్ధం చేసుకునే దిశగా అధినేత చంద్రబాబు కమిటీల కూర్పుపై కసరత్తు చేశారు. విధేయత, పనితీరును పరిగణనలోకి తీసుకుని పదవులు కేటాయించారు. ఈసారి పొలిట్‌బ్యూరోలో అనూహ్య మార్పులు చేశారు. మండల స్థాయి నాయకులకు పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్‌బ్యూరోలో చోటు కల్పిస్తామన్న లోకేశ్‌ హామీకి అనుగుణంగా.. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్‌ ఇన్‌చార్జి గుత్తికొండ ధనుంజయ్‌కు పొలిట్‌బ్యూరోలో పదవులు దక్కాయి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తే పార్టీ ఏ విధంగా అందలమెక్కిస్తోందో చెప్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ కూర్పులో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నామినేటెడ్‌ పదవుల్లో అవకాశాలు రాని వారికి న్యాయం చేశారు. యువత, మహిళలకు కమిటీల్లో ప్రాధాన్యం లభించింది.


యువ నాయకత్వానికి పెద్దపీట

పార్టీకి యువ నాయకత్వాన్ని అందించడమే లక్ష్యంగా చంద్రబాబు కమిటీల కూర్పును చేపట్టారు. 2024 ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రతో క్యాడర్‌, లీడర్లలో జోష్‌ నింపిన లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని కమిటీల్లోనూ యువతకు పెద్దపీట వేశారు. భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను వేగవంతం చేసేలా కమిటీల కూర్పు ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. 2024 ఎన్నికల నుంచి అన్ని రకాలుగా బేరీజు వేసుకుని సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌ చేస్తూ ఏ విధంగా అయితే టికెట్లు ఇచ్చారో పార్టీ కమిటీల్లోనూ అదే స్థాయిలో కసరత్తు చేశారు. రాష్ట్ర కమిటీలో 189 మందికి అవకాశం కల్పించగా.. వారిలో 78 మంది బీసీలు, 25 మంది ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, 13 మంది మైనారిటీలు ఉన్నారు.

డీలిమిటేషన్‌ను దృష్టిలో పెట్టుకుని..

నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకుని కూడా కమిటీల కూర్పును చేపట్టారు. డీలిమిటేషన్‌ జరిగితే ప్రస్తుతమున్న 175 స్థానాలు 263కి చేరే అవకాశం ఉంది. పెరగనున్న నియోజకవర్గాల్లో యువతకు సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో పార్టీ అధిష్ఠానం ఉంది. మహిళలకు ఈసారి ఇచ్చిన ప్రాధాన్యం గతంలో ఎప్పుడూ లేదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అన్ని కమిటీల్లో కలిపి 58 మంది మహిళలకు అవకాశం లభించింది. వచ్చే ఎన్నికల నాటికి 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకునేలా చంద్రబాబు కసరత్తు సాగింది.


కమిటీల కూర్పులో లోకేశ్‌ మార్కు

టీడీపీ కమిటీల కూర్పులో మంత్రి లోకేశ్‌ మార్కు స్పష్టంగా కనిపించింది. ఏడాది క్రితం కడప మహానాడులో లోకేశ్‌ కొన్ని కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఇచ్చారు. ఇది ఓ నినాదంగానే మిగిలిపోకుండా పార్టీ విధానంగా మార్చుకునేలా కృషి చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తకు అందని ద్రాక్షగా మిగిలిపోయే పొలిట్‌బ్యూరో లాంటి పదవులను దక్కేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. మండల పార్టీ అధ్యక్ష పదవులను, క్లస్టర్‌ ఇన్‌చార్జి పదవులను తేలిగ్గా తీసుకోవద్దని, కష్టపడితే అందరికీ పార్టీలో సముచిత ప్రాధాన్యం లభిస్తుందని చాలా కాలంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఆయన నిజం చేశారు. పొలిట్‌బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలకు పూర్తిగా కొత్త లుక్‌ ఇచ్చేలా కసరత్తు జరిగింది. ఈ కమిటీల ఏర్పాటుతో పనిచేసేవారికే పెద్దపీట అన్న సందేశాన్ని లోకేశ్‌ బలంగా చెప్పారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికపై సీనియర్‌ నేతలను కాకుండా క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలను కూర్చోబెట్టడం ద్వారా పనిచేసే వారికి సముచిత స్థానం అన్న విషయాన్ని లోకేశ్‌ స్పష్టంగా చెప్పారు. సీనియర్ల అనుభవం.. జూనియర్ల దూకుడు అనే సమతుల్యతను పాటించారు. అనుభవం ఉన్న నేతలకు గౌరవం, కొత్త తరం నాయకులకు అవకాశాలు అనేలా కమిటీల కూర్పును చేపట్టారు.


రాష్ట్ర కమిటీ..

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు: పల్లా శ్రీనివాసరావు

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు: గౌతు శిరీష, చింతకాయల విజయ్‌, పర్చూరి అశోక్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, పాశం సునీల్‌ కుమార్‌, వీఎస్‌ ముఖ్తియార్‌, ఎన్‌.అమర్‌నాథ్‌ రెడ్డి.

రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు: కిమిడి కళా వెంకటరావు, తమ్మినేని సుజాత, ఎస్‌వీఎ్‌సఎన్‌ వర్మ, వనమాడి వెంకటేశ్వరరావు, పంచుమర్తి అనురాధ, బొండా ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌, తెనాలి శ్రవణ్‌ కుమార్‌, భాష్యం రామకృష్ణ, కలపటపు బుచ్చిరాం ప్రసాద్‌, వీఆర్‌ శ్రీలక్ష్మి, షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌, డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌, ఆకేపోగు ప్రభాకర్‌, జి.తిప్పేస్వామి, జి.నరసింహయాదవ్‌.

రాష్ట్ర అధికార ప్రతినిధులు: కూన రవికుమార్‌, కావలి గ్రీష్మ, చల్లారపు రామ్మోహన్‌ నాయుడు, సుంకర పావని, గొల్లపల్లి అమూల్య, దాసరి శ్యామ్‌ చంద్రశేషు, డూండి రాకేశ్‌, ఎంఎస్‌ బేగ్‌, వసంత కృష్ణప్రసాద్‌, ఉండవల్లి శ్రీదేవి, పర్చూరి రమ్య, కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌.

వారు కాకుండా కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59 మందిని, కార్యదర్శులుగా 77 మందిని నియమించారు.


లోకేశ్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి

టీడీపీ కార్యాలయంలో సంబరాలు

టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ నియమితులు కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, నాలెడ్జ్‌ సెంటర్‌ చైర్మన్‌ మాల్యాద్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చి రాంప్రసాద్‌, టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌, మీడియా కో-ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లోకేశ్‌కు పలువురు మంత్రులు అభినందనలు తెలిపారు.

బాధ్యతగా పనిచేయండి

పదవులు పొందిన నేతలకు సీఎం శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల్లో పదవులు పొందిన నేతలందరికీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లను గౌరవించుకుంటూ, కొత్తవారికి అవకాశం కల్పిస్తూ, సామాజిక న్యాయం పాటిస్తూ.. పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. పార్టీతో అనుబంధం, కష్టపడే తత్త్వం, యువ రక్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కమిటీలను నియమించామని తెలిపారు. నిరంతరం రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పార్టీగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త కమిటీలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అంటే రాష్ట్రాభివృద్ధికి పనిచేయడమనే గొప్ప సంకల్పంతో నేతలకు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.


పొలిట్‌బ్యూరో సభ్యులు

చంద్రబాబు, కె.అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, గంట్యాడ శ్రీదేవి, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ), పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ షరీఫ్‌, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్‌ రాజగోపాల్‌(తాతయ్య), గుత్తికొండ ధనుంజయ్‌, నందమూరి బాలకృష్ణ, నక్కా ఆనంద్‌బాబు, అనగాని సత్యప్రసాద్‌, పిడుగురాళ్ల(గల్లా) మాధవి, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బీసీ జనార్దన్‌ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, బక్కిన నరసింహులు.

పొలిట్‌బ్యూరో ఎక్స్‌ అఫీషియో సభ్యులు: లోకేశ్‌, పల్లా శ్రీనివాసరావు, లావు శ్రీకృష్ణదేవరాయులు


జాతీయ కమిటీ..

జాతీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌: లోకేశ్‌

జాతీయ పార్టీ కోశాధికారి: కొనకళ్ల నారాయణ

జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శులు: కె.రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేశ్‌

జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు: దువ్వారపు రామారావు, మహ్మద్‌ నజీర్‌, సానా సతీశ్‌, రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత, ముళ్లపూడి బాపిరాజు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, బూరగడ్డ వేదవ్యాస్‌, కన్నా లక్ష్మీనారాయణ, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న, టీడీ జనార్దన్‌ రావు, నూకసాని బాలాజీ, బొల్లినేని రామారావు, బాలిశెట్టి హరిప్రసాద్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, మాధవ నాయుడు.

జాతీయ అధికార ప్రతినిధులు: కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణ ప్రసాద్‌, కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఆనం వెంకట రమణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గుణపాటి దీపక్‌ రెడ్డి, బీకే పార్థసారథి, నీలాయపాలెం విజయ్‌ కుమార్‌, తిరునగరి జోత్స్య, నన్నూరి నర్సిరెడ్డి.


జోనల్‌ కో-ఆర్డినేటర్లు

బెందాలం అశోక్‌, సుజయ కృష్ణ రంగారావు, మంతెన వెంకట సత్యనారాయణ రాజు, అరిమిల్లి రాధాకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, ప్రత్తిపాటి పుల్లారావు, దామచర్ల సత్య, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, బీటీ నాయుడు.

నాలెడ్జ్‌ కమిటీ సభ్యుడిగా గురజాల మాల్యాద్రి, స్టేట్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌చార్జిగా వేపాడ చిరంజీవి, మీడియా కమిటీ సభ్యులుగా దారపనేని నరేంద్ర, బీవీ వెంకటరాముడు నియమితులయ్యారు.

Updated Date - Apr 16 , 2026 | 05:44 AM