జగన్ కుట్రలపై జనంలోకి
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:04 AM
రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న విద్వేషపూరిత రాజకీయాలను జనంలోకి ఉమ్మడిగా తీసుకెళ్లాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి.
అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందాం
టీడీపీ, జనసేన అధినేతల నిర్ణయం
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘ భేటీ
వైసీపీ నేరపూరిత రాజకీయాలపైనే ప్రధాన చర్చ
కులచిచ్చు పెట్టాలని చూస్తోంది
తప్పుడు ప్రచారాలతో గందరగోళపరుస్తోంది
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారమే నిదర్శనం
తప్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు
కూటమిని విచ్ఛిన్నం చేసేందుకూ కుట్రలు: పవన్
కల్తీ నెయ్యి సున్నితమైన అంశం
అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నాం
దీనిని వైసీపీ అనుకూలంగా మార్చుకుంటోంది
జంతు కొవ్వు ఉందని తేలినా బుకాయిస్తోంది
సిట్ చార్జిషీటుపై కోర్టు నిర్ణయం తీసుకున్నాక
అన్ని ఆధారాలతో ఎండగడదాం: సీఎం
టీడీపీ, జనసేన సమన్వయంపై చర్చ
త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లపైనా
సున్నితమైన లడ్డూ అంశంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు వాస్తవాలనే వివరించాలనే ఉద్దేశంతో ఆచితూచి వెళ్తున్నాం. దీనిని వైసీపీ అడ్వాంటేజ్‌గా తీసుకుంది. కోర్టు నిర్ణయం తర్వాత జనంలోకి వెళ్లి ఎండగడదాం.
- సీఎం చంద్రబాబు
పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించడమే కాకుండా అడ్డగోలుగా సమర్థించుకుంటూ తిరిగి ప్రభుత్వంపైనే జగన్ అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. దీనిని తొలి రోజుల్లో సమర్థంగా తిప్పికొట్టాల్సింది.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఆ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్న విద్వేషపూరిత రాజకీయాలను జనంలోకి ఉమ్మడిగా తీసుకెళ్లాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ విద్వేష రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని కులాలకు ఆపాదించి, కులాల నడుమ చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని.. కాపు, కమ్మ, బీసీల నడుమ విద్వేషాలను నింపి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోందని ఇద్దరు నేతలూ అభిప్రాయపడ్డారు.
2014-19 మధ్య జగన్ ఇదే ఫార్ములా అనుసరించారని, కులాల నడుమ విద్వేషాలను రెచ్చగొట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ కమ్మ, కాపు కులాలకు కొమ్ము కాస్తోందని దుష్ప్రచారం చేసి, పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా ఉన్న బీసీల్లో విద్వేషాన్ని రగిల్చారని.. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తున్నారని అన్నారు. పవన్ స్పందిస్తూ.. ఈ పరిణామాలను తొలి నుంచే కలిసికట్టుగా ఎదుర్కోకపోతే వైసీపీ చేస్తున్న విద్వేష ప్రచారాన్నే ఆయా వర్గాలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుందని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నేర రాజకీయాలకు.. క్రిమినల్ ఆలోచనలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని, వారి రాజకీయాలు తీరూ అలానే ఉంటుందని సీఎం అన్నారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని సిట్ నివేదికలో స్పష్టంగా ఉన్నా.. జంతు కొవ్వులేదని అడ్డంగా వాదిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు. సిట్ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆధారాలతో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏం జరిగిందో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్దామని.. వైసీపీ వైఖరిని ఎండగడదామని తెలిపారు.
కూటమిని ఎదుర్కోలేక కుట్రలు..
కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉంటే అధికారంలోకి రాలేనని జగన్‌కు స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే కూటమిని.. ముఖ్యంగా టీడీపీ, జనసేనను విడగొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని సీఎం, డిప్యూటీ సీఎం అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా రెండు పార్టీల నేతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటి పట్ల రెండు పార్టీల శ్రేణులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తే కలిసికట్టుగా అడ్డుకోవాలని నిర్ణయించారు. 2024 ఎన్నికల ముందు కూడా కూటమి ఏర్పాటు కాకుండా వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిందని, విచ్ఛిన్న రాజకీయాలు.. విద్వేష రాజకీయాలు ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలపై ఆరోపణలకు చెక్..
రెండు పార్టీల ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని, వీటికి చెక్ పెట్టాలని అధినేతలిద్దరూ నిర్ణయించారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో తెప్పించుకుంటూ వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఆయన స్ఫూర్తితో తాను కూడా ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నానని పవన్ అన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో పార్టీపరంగా విచారణ చేపట్టామని, నివేదిక ఆధారంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. కొన్ని జిల్లాల్లో కూటమి పక్షాల మధ్య సమన్వయ లోపాలపైనా చర్చించారు. తరచూ రెండు పార్టీలూ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తుంటే చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.
జనసేనకు ఒక రాజ్యసభ సీటు!
త్వరలో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాల భర్తీ విషయమూ చర్చకు వచ్చింది. వీటిలో జనసేనకు ఒకటి కేటాయించే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న అంశంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు.
భేటీలో ఇద్దరే : కూటమిలో కీలక భాగస్వాములైన ఇద్దరు అగ్ర నేతల నడుమ చాలా రోజుల తర్వాత సుదీర్ఘ భేటీ జరగడం గమనార్హం. ఉదయం 10.40కి సీఎం నివాసానికి వచ్చిన పవన్.. మధ్యాహ్నం 1.20 గంటల వరకు అక్కడే గడిపారు. వీరిద్దరే ముఖాముఖి చర్చలు జరిపారు. రెండు పార్టీలకు చెందిన ఇతర నేతలెవరినీ భేటీకి ఆహ్వానించలేదు.
నేడు 3 కూటమి పార్టీల అగ్ర నేతల భేటీ
కల్తీ నెయ్యి వ్యవహారంపైనే ప్రధాన చర్చ
కూట మి పార్టీల అధినేతలు గురువారం భేటీ కానున్నా రు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అఽధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. చంద్రబాబ, పవన్ బుధవారం ముఖాముఖి భేటీ అయిన మర్నాడే మూడు పార్టీ ల నాయకులూ సమావేశమవుతుండడం ప్రాధా న్యం సంతరించుకుంది. శ్రీవారి లడ్డూను కల్తీనెయ్యితో అపవిత్రం చేసిందే గాక.. తమకు క్లీన్‌చిట్ వచ్చిందంటూ జగన్ అండ్ కో ప్రచారం చేసుకుంటుండడంపై కూటమి నేతలు మండిపడుతున్నా రు. వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెట్టి, అసలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించేందుకు భేటీ కావాలని అధినేతలు నిర్ణయించారు.