వినూత్నంగా ఆవిర్భావ సభ
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:25 AM
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి, సీనియర్ కార్యకర్తలు, యువ నేతలకు పెద్దపీట వేస్తూ ఆవిర్భావ సభ నిర్వహించారు.
19 మంది సీనియర్ కార్యకర్తలకు చంద్రబాబు సరసన వేదికపై చోటు
తొలుత కేంద్ర కార్యాలయంలో టీడీపీ జెండా ఎగురవేసి ఉత్సవాలకు శ్రీకారం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు
పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని కార్యకర్తలతో కలిసి బాబు ప్రతిజ్ఞ
అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి, సీనియర్ కార్యకర్తలు, యువ నేతలకు పెద్దపీట వేస్తూ ఆవిర్భావ సభ నిర్వహించారు. కేంద్ర కార్యాలయంలో సభా వేదికపై సీనియర్ కార్యకర్తలను, సభికుల్లో సీనియర్ నేతలను కూర్చోబెట్టి సభను నిర్వహించడం ఆకట్టుకుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నవారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారు, గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన 19మంది సామాన్య కార్యకర్తలకు వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు సరసన కూర్చునే అవకాశం కల్పించారు. పార్టీ కోసం తాము పనిచేసిన విధానాన్ని సీనియర్ కార్యకర్తలు సభావేదికపై నుంచే వివరించారు. ఆదివారం ఉదయం.. కేంద్ర కార్యాలయం ముందు భారీ టీడీపీ జెండా ఎగురవేసి చంద్రబాబు ఉత్సవాలను ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరిలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తామంటూ కార్యకర్తలతో కలిసి సీఎం ప్రతిజ్ఞ చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చందబ్రాబుతో అక్కడి టీడీపీ అధ్యక్షుడు మాణిక్యయాదవ్, తెలంగాణ సీనియర్ టీడీపీ నాయకుడు బక్కని నర్సింహులు మాట్లాడారు.
ఆకట్టుకున్న వీడియో ప్రజెంటేషన్
ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రజంటేషన్ చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా టీడీపీ చేసిన రాజకీయాలను, పాలనను ప్రజెంట్ చేస్తూ వీడియో ప్రదర్శన సాగింది. పార్టీ సంక్షేమం కోసం నారా లోకేశ్ చేసిన కృషిని, లోకేశ్ పాదయాత్రను ప్రస్తావించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలను అద్దం పట్టేలా వీడియో రూపకల్పన చేశారు. వైసీసీ హయాంలో చంద్రబాబుసహా వివిధ సీనియర్ నేతలపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు జరిపిన తీరును వివరించారు. లోకేశ్ పాదయాత్రకు నాటి ప్రభుత్వం అడుగడుగునా కల్పించిన అడ్డంకులను.. దీన్ని ఎదురొడ్డి పాదయాత్రను కొనసాగించిన వైనానికి అద్దం పట్టేలా ఏవీ రూపకల్పన చేశారు. రాజధాని రైతులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఆర్యవైశ్యులపై దాడులు చేసి నాటి జగన్ ప్రభుత్వం ఎలా ఇబ్బందులు పెట్టిందనే అంశాన్ని సోదాహరణంగా వివరించారు. వీడియో ప్రదర్శనలో వివేకా హత్య అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సీనియర్ కార్యకర్తలకు బాబు, లోకేశ్ ఆత్మీయ విందు
అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసంలో పార్టీ సీనియర్ కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ ఆత్మీయ విందు ఇచ్చారు. 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. 1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు ఈ విందు ఏర్పాటు చేశారు. హాజరైన కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను ఇద్దరూ అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మరచిపోలేమని సీఎం వ్యాఖ్యానించారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వడం జీవితంలో మరచిపోలేమంటూ కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. వారిని చంద్రబాబు నూతన వస్త్రాలు, శాలువాతో సత్కరించారు.