నేడు తెలుగుదేశం ఆవిర్భావ దినం
ABN , Publish Date - Mar 29 , 2026 | 03:54 AM
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదివారం టీడీపీ ఆవిర్భావ రోజు. 45వ ఏట అడుగు పెడుతోంది.
ఆత్మగౌరవ నినాదానికి 44 వసంతాలు
విప్లవాత్మక రాజకీయాలకు నాంది
తెలుగునాట ఎన్నో సంచలన నిర్ణయాలు
విద్యావంతులు, దళితులు, బీసీలకు ప్రాధాన్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదివారం టీడీపీ ఆవిర్భావ రోజు. 45వ ఏట అడుగు పెడుతోంది. చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం అంటే.. ఓ సంచలనమే. బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక కనుమరుగైపోతున్న కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఇన్నేళ్లు నిలబడటం మామూలు విషయం కాదు. అందులోనూ దాదాపు సగం కాలం అంటే.. 21 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉంది. 2009 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండటం ఒక సవాల్ అయితే, 2019 నుంచి 2024 వరకు మరో సవాల్. ఆ ఐదేళ్లూ అధికారంలో ఉన్న జగన్ టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి తొలిసారి జైలుపాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధించారు. అయినా క్యాడర్ చెక్కు చెదరలేదు. సమ్మెట దెబ్బలతో రాటుతేలినట్టు మరింత ఉత్సాహంతో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. అద్భుతమైన విజయం సాధించారు. 1995 సంక్షోభం మొదలు.. ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ పార్టీని, క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి పార్టీని నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
పుట్టుకే సంచలనాల సమాహారం
టీడీపీ ఆవిర్భావంలోనే వైవిధ్యం ఉంది. ఆరు పదుల వయసులో ప్రాంతీయ పార్టీని స్థాపించడమే సాహసం అయితే, అప్పుడే పురుడు పోసుకున్న పార్టీలో ఉద్దండులైన రాజకీయ నాయకుల కన్నా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులకు ప్రాధాన్యమిచ్చి టికెట్లు ఇవ్వడం ఎన్టీఆర్ చేసిన మరో సాహసం. అప్పటి వరకు రాజకీయం అంటే కేవలం కొన్ని సామాజికవర్గాలకే పరిమితం. కానీ ఎన్టీఆర్ రాజకీయ సమీకరణాలను మార్చేశారు. విద్యావంతులకు, దళితులకు, బీసీలకు ప్రాధాన్యమిచ్చారు. 1983లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజనీర్లు, 128 మంది పట్టభద్రులు ఉన్నారు. రాజకీయాల్లో విద్యావంతులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దక్కింది టీడీపీ ఆవిర్భావం తర్వాతే.
అభిమానులకు అగ్రతాంబూలం
అప్పట్లో ఎన్టీఆర్ తన అభిమానులకూ తగిన ప్రాధాన్యమిచ్చారు. 1983 ఎన్నికల్లో గుంటూరు-1 అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఉమర్‌ఖాన్ పటాన్(బుడేఖాన్) ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆయన ఎన్నికల ఖర్చు కోసం ఇంటిని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చుకున్నారు. ఆయనతోపాటు ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన శ్రీపతిరాజేశ్వర్ వంటి అభిమాన సంఘ నాయకులు చాలా మందే ఉన్నారు. ఆ ఎన్నికల్లో వీరంతా గెలిచారు.
అట్టహాసంగా ఏర్పాట్లు
తెలుగువారి ఆత్మగౌరవం కోసం.. అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం.. ఆవిర్భవించిన టీడీపీ 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పసుపుదళంలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
విప్లవాత్మక మార్పులకు నాంది
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ చేసిన మొదటి పని.. ఎమ్మెల్యేలకు ప్రవర్తనా నియమావళిని రూపొందించడం. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో జోక్యం చేసుకోరాదని వంటి పలు నిబంధనలను ఆ నియమావళిలో పొందుపరిచారు. రాజకీయాలంటే వ్యాపారం కాదని.. పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని తెలుగుదేశం పార్టీ చాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మలుపు తిప్పే ఎన్నో నిర్ణయాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. వాటిలో మచ్చుకు కొన్ని..
మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు. తెలుగు భాషను ప్రోత్సహించేందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ సొంతం.
మునసబు, కరణాల వ్యవస్థ.. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వమే.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారు. దేశంలో అలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఉమ్మడి ఏపీనే.
మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేశారు.
ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ ఉండాలన్న లక్ష్యంతో పేదలకు రూ.2కే కిలో బియ్యాన్ని అందించారు. పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జనతా వస్త్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.