Share News

టీడీపీ 3.0

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:36 AM

తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్‌తో సరికొత్త పంథాలో దూసుకుపోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు...

టీడీపీ 3.0

  • సరికొత్త పంథాతో దూసుకెళ్తోంది

  • ఏడాది పొడవునా శిక్షణ తరగతులు

  • పైరవీలతో పనిలేదు.. పనితీరే ప్రామాణికం

  • జూన్‌ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి

  • వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం

  • జగన్‌కు నిలకడలేదు, సీరియ్‌సగా తీసుకోనక్కర్లేదు: లోకేశ్‌

  • నేతలతో ‘కాఫీ కబుర్లు’.. మై టీడీపీ టాప్‌-10 కార్యకర్తలతో భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్‌తో సరికొత్త పంథాలో దూసుకుపోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ పేరుతో పార్టీ క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జులతో ఆయన సమావేశమయ్యారు. పైరవీలతో పనిలేకుండా పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులిస్తామన్నారు. సభ్యత్వ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఎవరు ఎంత పనిచేశారో తెలిసిపోతోందని చెప్పారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తామంతా కింద కూర్చోగా, అధినేత చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారని.. పార్టీలో వస్తున్న అనూహ్య మార్పులకు ఇదొక సంకేతమన్నారు. ‘తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం. తెలంగాణలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులతో పాటు అక్కడి మెజారిటీ నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే. 1989-94 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు ట్రైనింగ్‌ క్లాసులు పెట్టి క్యాడర్‌ను చైతన్యవంతం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి క్యాడర్‌కు పెద్దఎత్తున శిక్షణ తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమం. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడం, పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించడమే వీటి ప్రధాన లక్ష్యం. ఇకపై క్లస్టర్‌, యూ నిట్‌, గ్రామ, మండలస్థాయి వరకు ఏడాది పొడవునా 365 రోజులూ నిరంతరం శిక్షణ తరగతులు పెడతాం’ అని వెల్లడించారు.


జగన్‌కు నిలకడ లేదు..

వైసీపీ అధినేత జగన్‌ మాటలను ఎవరూ సీరియ్‌సగా తీసుకోవలసిన అవసరం లేదని లోకేశ్‌ అన్నారు. ‘నిన్న మావిగన్‌ అన్న నోటితోనే మళ్లీ ఈ రోజు 3 రాజధానులు అంటున్నా రు. అధికారంలో ఉన్నప్పుడే కాకుం డా ఇప్పుడు కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండడం లేదు. ఇంటి వద్ద 30 అడుగుల ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్నారు. 2019లో టీడీపీ ఓటమి పాలైనా.. చంద్రబాబు అనునిత్యం జనంలోనే ఉన్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఏడాదిలోనే ఇసుక కష్టాలపై ఉద్యమించారు. కార్యకర్తల ఆవేదనా విన్నారు. క్యాడర్‌కు దగ్గరగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. పార్టీలో పనిచేయడానికి పదవులే ప్రామాణికం కాదు. వివిధ సమీకరణల వల్ల ఇప్పుడు అవకాశం రానివారికి మరోసారి కల్పిస్తాం’ అని చెప్పారు.

టాప్‌-10 కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం..

కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతమని లోకేశ్‌ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మైటీడీపీ’ యాప్‌ సమర్థ వినియోగం, పార్టీ పిలుపి చ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ మంచి పనితీరు కనబరచిన టాప్‌-10 కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ‘తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ. మనందరం అందులో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడవరకు రాగలిగారు. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా. కార్యకర్తే అధినేత, గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ పొలిట్‌బ్యూరో వరకు రాగలగాలి. పార్టీ భవిష్యత్‌ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలతో జనంలోకి వెళ్లాలి’ అని చెప్పారు. అనంతరం వారందరినీ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్‌ జ్ఞాపికను బహుకరించారు. లోకేశ్‌తో ఆత్మీయ భేటీని జీవితాంతం మరువలేమని ‘మైటీడీపీ’ ఉత్తమ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.


నాయకులపై లోకేశ్‌ ఫైర్‌

ఈ సమావేశంలో కొందరు టీడీపీ నాయకులపై లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వరుసగా నాలుగు వారాలు క్యాడర్‌ సమావేశాలు, గ్రీవెన్స్‌ నిర్వహించనందుకు మండిపడ్డారు. ఎందుకు జరపలేదో కారణాలు అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే నాలుగు వారాల నుంచి క్యాడర్‌ సమావేశాలు నిర్వహించని పులివెందుల ఇన్‌చార్జ్‌ బీటెక్‌ రవి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి.. నాలుగు వారాల నుంచీ గ్రీవెన్స్‌ నిర్వహించని ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.

మాయ, విధ్వంసం... జగన్‌... ఇదేనా ప్లాన్‌ బీ: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘మా... య, వి... ధ్వంసం, గన్‌... దరగోళం/గన్‌... కల్చర్‌’ ఇదేనా జగన్‌ మీ ప్లాన్‌ బీ?’ అని మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. జగన్‌రెడ్డి మావిగన్‌ ప్రతిపాదనపై బుధవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘మావిగన్‌ మావయ్య, హిస్టారిక్‌ అమరావతి రెజుల్యూషన్‌’ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను లోకేశ్‌ తన పోస్టుకు జత చేశారు.

Updated Date - Apr 09 , 2026 | 04:37 AM