ప్రణాళికాబద్ధంగా తణుకు అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:02 AM
తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు..
రూ.1.40 కోట్లతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి శంకుస్థాపన
‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండాగా’ హామీ అమలు
తణుకు, జూలై 10(ఆంధ్రజ్యోతి): తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో రూ.1.40 కోట్లతో చేపట్టే కోయాక్సిల్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 30న తణుకు-పైడిపర్రు 32వ వార్డులో ‘అక్షరం అండగా-పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఒక మంచి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కార వేదిక దొరికిందని తెలిపారు. ప్రభుత్వాలతోపాటు, మీడియా సంస్థ కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలకు అండగా నిలవడం మంచి పరిణామమని కొనియాడారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. ఇతర సమస్యల పరిష్కారానికీ ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్ బి.హరిబాబు, మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, డీఈఈ కె.ఈశ్వర్‌రెడ్డితోపాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.