నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త తమ్మినేనే!
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:18 AM
నకిలీ పత్రాలతో ప్రైవేటు భూమిని ఆక్రమించిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు.
వాటి ఆధారంగా విలువైన ఆస్తి రిజిస్ట్రేషన్
తమ్మినేని, ఫ్యామిలీ సమక్షంలోనే ప్రణాళిక
కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉంది
ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు
హైకోర్టును కోరిన పోలీసులు, ఫిర్యాదుదారు
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలతో ప్రైవేటు భూమిని ఆక్రమించిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. భూయజమాని మరణించినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించి, రజనీ అనే మహిళను యజమాని కుమార్తెగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొంది విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ‘నకిలీ పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ప్రణాళిక పిటిషనర్ల సమక్షంలోనే జరిగినట్లు వారి ఉద్యోగులే వాంగ్మూలం ఇచ్చారు. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం రూ.72 లక్షలు చెల్లించినట్లు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. గోల్డ్ లోన్ రూపంలో పిటిషనర్లు తీసుకున్న రుణం రూ.20లక్షలు మాత్రమే. ఆ సొమ్మును కూడా ఇతర అవసరాల కోసం ఖర్చు చేసినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా ఉంది. పిటిషనర్లు పరారీలో ఉన్న కారణంగా వారిని అరెస్టు చేయలేకపోయాం. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉంది. అందువల్ల వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు’’. అని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరువైపుల వాదనలు గురువారం ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌చేసింది. ఈ నెల 27న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరు మీద తమ్మినేని సీతారాం రిజిస్టర్ చేయించారని ఆరోపిస్తూ కట్టా జయకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం(ఏ6), వాణి (ఏ7), వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు (ఏ5) పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ, దర్యాప్తునకు సహకరించేందుకు పిటిషనర్లు సిద్ధంగా ఉన్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, ఫిర్యాదుదారు జయకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.