Share News

బాధితుల రక్తంలో.. యూరియా, క్రియాటినిన్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:28 AM

కల్తీపాల బాధితుల రక్తంలో యూరియా, సీరమ్‌ క్రియాటినిన్‌ స్థాయిలు అధికంగా ఉండడం వల్లే విషపూరిత ప్రభావం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

బాధితుల రక్తంలో.. యూరియా, క్రియాటినిన్‌

  • అందుకే విషపూరిత ప్రభావం

  • అనూరియా బాధితుల కేసుల్లో కల్తీ పాలే ప్రధాన కారణమని నిర్ధారణ

  • వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక నివేదిక

  • ఆస్పత్రుల్లో 15 మందికి వైద్యం

  • వారిలో ఏడుగురి పరిస్థితి విషమం

  • చికిత్స పొందుతూ ఆరేళ్ల బాలుడి మృతి

  • ఆరుకు చేరిన కల్తీ పాల మృతులు

రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కల్తీపాల బాధితుల రక్తంలో యూరియా, సీరమ్‌ క్రియాటినిన్‌ స్థాయిలు అధికంగా ఉండడం వల్లే విషపూరిత ప్రభావం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. వైద్యఆరోగ్యశాఖ ప్రాథమిక నివేదికలో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ప్రాథమిక ఎపిడెమియాలజికల్‌ పరిశీలనలో కల్తీ పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలిందన్నారు. కల్తీ పాల ఘటనలో 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఏడుగురు వెంటిలేటర్‌, డయాలిసిస్‌ సహాయంతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. జిల్లా పర్యవేక్షణాధికారి, వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు, నెఫ్రాలజిస్ట్‌లతో కూడిన అధికారులతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. 14 ఫీల్డ్‌ సర్వేలెన్స్‌ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్ర్కీనింగ్‌ చేశాయని, 110 కుటుంబాల్లో 315 మంది రక్తనమూనాలు సేకరించాయని చెప్పారు. వాటిలో 313 సాధారణ పరిస్థితుల్లో ఉండగా రెండు నమూనాల్లో మాత్రం యూరియా, క్రియాటినిన్‌ స్థాయిలు పెరిగినట్టు తేలిందన్నారు. ఇప్పటికే వరలక్ష్మి మిల్క్‌డెయిరీలో తనిఖీలు చేసి పాలు, పన్నీర్‌, నెయ్యి, మంచినీరు, వెనిగర్‌ నమూనాలు సేకరించామని, ప్రభావిత ఇళ్ల నుంచి కూడా పాలు, పెరుగు నమూనాలు సేకరించామని తెలిపారు. వీటిని కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ, విమ్టా ల్యాబ్‌లకు పంపించామన్నారు. 41 పాల నమూనాలు, పశువులకు ఇచ్చే ఆహారం, నీటి నమూనాలు సేకరించి వెటర్నరీ బయలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు తెలిపారు.


  • విశాఖ కేజీహెచ్‌లో ఆరేళ్ల బాలుడి మృతి

కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన రాజమహేంద్రవరానికి చెందిన ఆరేళ్ల బాలుడు మనోహర్‌ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మనోహర్‌కు మూత్రంలో ఇబ్బందులు, కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కాకినాడ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడి నుంచి ఈ నెల 18న కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి బాలుడికి యూరిన్‌ రాకపోవడం, కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో డయాలసిస్‌ చేస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో వెంటిలేటర్‌ అమర్చారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మనోహర్‌ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, ఈ బాలుడి మృతితో కల్తీపాల మృతుల సంఖ్య ఆరుకు చేరింది.


  • కల్తీపాల కేసులో నిందితుడు గణేశ్‌ అరెస్ట్‌

కల్తీ పాల విక్రయం కేసులో నిందితుడు అడ్డాల గణే్‌షను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు (గణేశ్‌) 11 ఏళ్లుగా తన గ్రామంలో వరలక్ష్మి డెయిరీ పేరుతో ఎలాంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఇళ్లకు వెళ్లి విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఈనెల 15న ఫ్రిడ్జ్‌లోని పాలు చూడగా ఒక క్యాన్‌లో అడుగున గడ్డకట్టడం గమనించాడు. అప్పటికే పైన ఉన్న పాలను కొందరికి అమ్మగా.. అవి చేదుగా ఉన్నాయని గణేశ్‌కి వాళ్లు చెప్పారు. గణేష్‌ ఈ విషయాన్ని నరేంద్రపురంలోని తన బావ డేగల గంగాధర్‌కు తెలిపాడు. అయితే, వాటిని విక్రయించవద్దని గంగాధర్‌ చెప్పినా వినకుండా సుమారు 105 మందికి ఆ పాలను విక్రయించానని గణేశ్‌ మధ్యవర్తుల సమక్షంలో చెప్పాడని సమాచారం. కాగా, కల్తీ పాలు తాగి మృతి చెందిన నలుగురికి ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్‌ కిర్తీ చేకూరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ మంగళవారం అందజేశారు. తాడి కృష్ణవేణి, తాడి రమణిల కుటుంబానికి రూ.20లక్షలు, నీలా శేషగిరిరావు కుటుంబానికి రూ.10లక్షల చెక్కు అందించారు.


  • మెరుగైన వైద్యం అందిస్తున్నాం

  • చెన్నై, ముంబై నుంచి మందులు: వీరపాండియన్‌

రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనకు సంబంధించి ఆస్పత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఏపీఐఐసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలలో యూరియా ఆనవాళ్లు గురించి ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని చెప్పారు. మంగళవారం కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. పాలను శీతలీకరణ చేసే మిషన్లలో కూలెంటుగా ఉపయోగించే ఇథలిన్‌ గ్లైకాల్‌ లీక్‌ అయినట్లు పోలీసలు విచారణలో గుర్తించారన్నారు. చికిత్స పొందుతున్న వారి కోసం ఏపీలో అందుబాటులో లేని మందులను చెన్నై, ముంబై నుంచి తెప్పిస్తున్నామని వివరించారు.


  • కల్తీపాల ఘటన దురదృష్టకరం: పురందేశ్వరి

కల్తీపాలు తాగి 15మంది అనారోగ్యం పాలవడం దురదృష్టకరం, బాధాకరమని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణచౌదరితో కలిసి ఎంపీ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, వారి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని ఆమె మీడియాకు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లావ్యాప్తంగా పాలశీతలీకరణ యంత్రాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 03:53 AM