Share News

నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:24 AM

తాడిపత్రిలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల వాగ్వాదం, కేకలు, అరుపులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ

  • తాడిపత్రిలో ఉద్రిక్తత

తాడిపత్రి, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): తాడిపత్రిలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో టీడీపీ, వైసీపీ వర్గీయుల వాగ్వాదం, కేకలు, అరుపులతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాలివీ.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.. కావేటి సముద్రం గ్రామానికి చెందిన సంజీవరెడ్డి కుమారుడు ఉమామహేశ్వర్‌రెడ్డికి, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.. నంద్యాల జిల్లా గోరమానపల్లికి చెందిన రామేశ్వర్‌రెడ్డి కుమార్తె సౌజన్యరెడ్డికి వివాహం నిర్ణయించారు. వారి నిశ్చితార్థం తాడిపత్రిలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి టీడీపీ, వైసీపీ వర్గీయులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ నాయకులు.. ‘ఈయనెందుకు వచ్చారని?’ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో గొడవ మొదలైంది. జేసీ అనుచరులు ‘మీరెందుకు వచ్చార’ంటూ వారిపై మండిపడ్డారు. సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామిరెడ్డి, వారి బంధువులు హనుమంతరెడ్డి, వైసీపీ నాయకుడు కందిగోపాల మురళీప్రసాద్‌రెడ్డితో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి సర్దిచెప్పారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ మద్దతుదారులు.. హనుమంతరెడ్డి వాహన అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని, వైసీపీ వర్గీయులను బయటకు పంపించారు. తర్వాత బందోబస్తు నడుమ నిశ్చితార్థం ముగించారు.

Updated Date - Aug 17 , 2026 | 05:25 AM