Share News

వివేకా హత్య కేసులో త్వరగా న్యాయం జరగాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:31 AM

ఏడేళ్లుగా నడుస్తున్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరగా న్యాయం జరగాలని ఏ-2 సునీల్‌ యాదవ్‌ అన్నారు.

వివేకా హత్య కేసులో త్వరగా న్యాయం జరగాలి

  • తప్పుడు ఆరోపణలు చేస్తే కేసు వేస్తా.. ఏ-2 సునీల్‌ యాదవ్‌ హెచ్చరిక

పులివెందుల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్లుగా నడుస్తున్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరగా న్యాయం జరగాలని ఏ-2 సునీల్‌ యాదవ్‌ అన్నారు. రిటైర్డ్‌ ఏసీపీ రాజేశ్వర్‌రెడ్డి ఈ కేసులో తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని.. మీడియా ట్రయల్‌ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సునీల్‌ యాదవ్‌ బుధవారం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఈ కేసులో త్వరగా న్యాయం జరగాలని తానొక్కడినే నిరంతరం కోరుతున్నానని.. మిగతా నిందితులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు. తాను తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా నిలబడి పోరాడుతున్నానన్నారు. ‘రిటైర్డ్‌ ఏసీపీ రాజేశ్వర్‌రెడ్డికి స్పష్టంగా చెప్పేది ఒక్కటే.. కోర్టులో ఉన్న విషయాలను మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం, నన్ను వ్యక్తిగతంగా దూషించడం, మాస్టర్‌ చీటర్‌ అంటూ ముద్ర వేయడం అన్యాయం.. చట్టవిరుద్ధం. ఆయన జడ్జి కాదు. తీర్పు చెప్పే అధికారం కోర్టుకే ఉంది. మీడియా ట్రయల్‌ నడిపిస్తూ, మిగతా వారిని కాపాడుతూ నన్ను మాత్రమే టార్గెట్‌ చేయడం వెనుక ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుస్తోంది. నిజంగా కేసుపై ఆయనకు సమాచారం ఉంటే కోర్టులో సమర్పించాలి. తప్పుడు ఆరోపణలు కొనసాగితే ఆయనపై కేసు వేయడానికి కూడా వెనుకాడను’ అని హెచ్చరించారు. నిజం బయటకు రావడం ఖాయమని.. న్యాయం తప్పకుండా గెలుస్తుందని సునీల్‌ యాదవ్‌ అన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 03:31 AM