‘అమూల్’ తరహాలో డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:24 AM
మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో.. రాష్ట్రంలో మెప్మా, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న డ్వాక్రా ఉత్పత్తులకు కూడా అదేస్థాయిలో....
మల్టీ బిలియనీర్ డాలర్ల కంపెనీల స్థాయిలో తీసుకొచ్చాం
గ్లోబల్ మార్కెటింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ ఉత్పత్తులకు ఎలాంటి బ్రాండింగ్ లభిస్తుందో.. రాష్ట్రంలో మెప్మా, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న డ్వాక్రా ఉత్పత్తులకు కూడా అదేస్థాయిలో ‘స్వయం’ పేరుతో బ్రాండింగ్ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికోసం ప్రత్యేక లోగోను కూడా తయారు చేశామన్నారు. పాడి రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న అమూల్ తరహాలోనే ఎస్‌హెచ్‌జీ మహిళల భాగస్వామ్యంతో కూడిన డ్వాక్రా ఉత్పత్తులను కూడా సహకార విధానంలో గ్లోబల్ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో ‘ప్రోడక్ట్ పర్ఫెక్షన్’ అంశంపై సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో కోటీ 10 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరంతా రూ.5 వేల కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించే స్థితిలో ఉన్నారని తెలిపారు. అందుకే బ్యాంకులు కూడా వారికి ఉదారంగా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. ఇంతటి క్రెడిబులిటీ ఉన్న డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జిల్లాకు ఒక బ్రాండ్‌ను ఏర్పాటు చేయగలిగితే అద్భుతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 బ్రాండ్లను రూపొందించి పోటీని పెంచాలని సూచించారు. ఏ బ్రాండ్ పేరూ లేకపోతే మార్కెట్‌లో ఆ ఉత్పత్తుల విలువ సగానికి తగ్గిపోతుందన్నారు. ‘స్వయం’ బ్రాండ్ కోసం డ్వాక్రా ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండేలా క్వాలిటీ పర్ఫెక్షన్, ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ అత్యంత కీలకమని చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని ప్రామాణిక మార్పులు తీసుకురావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రోడక్ట్ పెర్ఫెక్షన్ కోసం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.