Share News

‘చలో విజయవాడ’ ఉద్రిక్తం

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:40 AM

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ ఆందోళనకు అనుమతి లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు భారీగా విజయవాడ తరలివచ్చారు.

‘చలో విజయవాడ’   ఉద్రిక్తం
CHALO VIJAYAWADA PROTEST

  • భారీగా తరలివచ్చిన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు

  • అనుమతి లేకపోవడంతోధర్నాచౌక్‌ ప్రాంతాన్ని

    దిగ్బంధించిన పోలీసులు

  • బారికేడ్లను తోసుకుంటూ

ముందుకు.. పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట

  • సమస్యల పరిష్కారానికి

ఉద్యోగుల డిమాండ్‌

విజయవాడ/ధర్నాచౌక్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ ఆందోళనకు అనుమతి లేకపోయినా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు భారీగా విజయవాడ తరలివచ్చారు. అనుమతులు లేనందున ఉద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఉద్యోగులు విజయవాడకు చేరకుండా పోలీసులు కొన్నిచోట్ల ముందస్తుగానే అడ్డుకున్నారు. గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో కొందరిని నిలువరించారు. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు ఇతర మార్గాల ద్వారా విజయవాడకు బయలు దేరారు. దీంతో ధర్నాచౌక్‌కు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. భారీగా మోహరించిన పోలీసులు రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టారు. చల్లపల్లిబంగ్లా, లెనిన్‌ సెంటర్‌, సాంబమూర్తి రోడ్డు, ఏలూరు లాకులు తదితర ప్రాంతాలను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అయితే, భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు.. బారికేడ్లు, రోప్‌వేలను దాటుకుంటూ ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అధికసంఖ్యలో ఉద్యోగులు రావడంతో వారిని నిలువరించడం పోలీసులకు సాధ్యం కాలేదు. అందరూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ.. రోడ్డుపై భైఠాయించారు. కొన్ని మార్గాల్లో ఉద్యోగులు బారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ కళ్లుగప్పి ధర్నాచౌక్‌కు చేరుకున్న సచివాలయ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యోగులు అలంకార్‌ సెంటర్‌లో బైఠాయించారు. పోలీసులు ఎంత వారించినా వారు పెడచెవిన పెట్టారు.


తక్షణమే పరిష్కరించాలి: జేఏసీ

నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌ చానల్స్‌ కల్పించడం, పెండింగ్‌ ప్రమోషన్లు, జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌ అప్‌గ్రేడేషన్‌, పెండింగ్‌ వేతనాల చెల్లింపు, సస్పెషన్లు/బైండోవర్లపై సమీక్ష, సర్వీస్‌, కేడర్‌ సమస్యల పరిష్కారం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌ చేసింది. గత 13, 15 నెలలుగా చర్చలు జరుగుతున్నా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని జేఏసీ చైర్మన్‌ మహమ్మద్‌ జానీపాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జేఏసీ ప్రతినిధి జగదీశ్‌ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ను తక్షణమే అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికీ కనీస మూలవేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్‌ చానల్‌ కల్పించాలని కోరారు. జీవో 11ను వెంటనే రద్దు చేయాలని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. మరోవైపు.. నిరసన విరమిస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించినా.. ఉద్యోగులు మాత్రం కొనసాగించారు. సంబంధిత మంత్రి వచ్చి లిఖిత పూర్వక హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదన్నారు. కాగా, ధర్నాచౌక్‌ వద్ద శ్రీరాముల సంపత్‌, కంటు కార్తీక్‌ అనే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిని విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.

Updated Date - Sep 28 , 2026 | 02:40 AM