Share News

Swarna Panchayat Portal: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు!

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:51 AM

గ్రామ పంచాయతీల్లో చేపట్టే పన్నుల వసూళ్లలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది.

Swarna Panchayat Portal: పంచాయతీలకు ‘స్వర్ణ’ కాంతులు!

  • ఆన్‌లైన్‌ చెల్లింపులతో సత్ఫలితాలు.. ఇప్పటికే 200 కోట్ల పన్ను వసూళ్లు

  • 88 లక్షల ఆస్తుల కంప్యూటరీకరణ

  • వాట్సాప్‌, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు

  • పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల్లో చేపట్టే పన్నుల వసూళ్లలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ సత్ఫలితాలను ఇస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్‌ ఖాతాకు చేరాయి. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం గ్రామాల్లోని ఆస్తులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని 13వేల పంచాయతీల్లో 88లక్షల అసె్‌సమెంట్లను గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఏ ఆస్తికి ఎంత పన్ను వసూలు చేయాలో స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. పంచాయతీలకు చెల్లించాల్సిన డిమాండ్‌ నోటీసులు కుటుంబాల యజమానుల ఫోన్లకు పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,052 కోట్ల మేర పన్నులు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించే వెసులుబాటు కల్పించారు. డబ్బులు చెల్లించిన వెంటనే ఆ మొత్తానికి రశీదు అందుతోంది. వాట్సాప్‌, ఫోన్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా కూడా ఈ పన్నులు చెల్లించే అవకాశం లభించింది. పన్ను వసూళ్లలో ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పౌరులు చెల్లించే ప్రతిపైసాకు జవాబుదారీగా స్వర్ణ పంచాయతీ నిలుస్తోంది.


పెరిగిన ఆదాయం

పంచాయతీల్లో ఎంతమేర పన్నులు వసూళ్లు అవుతున్నాయి? ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై మొన్నటివరకూ కాకి లెక్కలు చూపించేవారు. వసూలు చేసే పన్నులకు లెక్కపక్కా లేకపోవడంతో నిధులు భారీగా దుర్వినియోగమయ్యేవి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెచ్చిన స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ పన్నులకు రక్షణగా నిలిచింది. దీంతో పాటు పన్నుల వసూళ్ల శాతం కూడా పెరగనుంది. అలాగే ఏ పంచాయతీకి ఎంత పన్ను వసూలైందో ఆన్‌లైన్‌లో ఎవరైనా చూసుకునే వెసులుబాటు కల్పించారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లకుండానే, పంచాయతీ కార్యదర్శిని సంప్రదించకుండానే పన్నులు చెల్లించే అవకాశం లభించింది. రాష్ట్రంలోని పంచాయతీలకు వార్షికాదాయం ఎంతన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టమైన లెక్కల్లేవు. 2024-25 సంవత్సరం అసె్‌సమెంట్‌ ప్రకారం ఇప్పుడు స్వర్ణ పంచాయతీల్లో సుమారు రూ.1,052 కోట్లు పన్నుల ఆదాయం రానుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది మరో 5శాతం ఆదాయం పెరగనుంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌తో ఇకపై పన్నుల రాబడి స్థిరంగా ఉండటంతో పాటు తప్పుడు బిల్లులకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 01 , 2026 | 05:54 AM