‘స్వర్ణ పంచాయతీ’ల ఆదాయంతోనే నిర్వహణ
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:15 AM
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో పారదర్శక కోసం తీసుకొచ్చిన స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ఇక పంచాయతీల్లో చేసే వ్యయానికి కూడా వినియోగించనున్నారు.
సిబ్బంది జీతాలకే మొదటి ప్రాధాన్యం
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో పారదర్శక కోసం తీసుకొచ్చిన స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ను ఇక పంచాయతీల్లో చేసే వ్యయానికి కూడా వినియోగించనున్నారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా గ్రామాల్లో సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు. ఈ పన్నుల రాబడిని తిరిగి పంచాయతీలకే ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వ్యయ నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలని ఉపముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అదే పోర్టల్ ద్వారా వ్యయ నిర్వహణ చేపట్టనున్నారు. ఆదాయాన్ని సమర్థవంతంగా ఖర్చు చేసేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. పంచాయతీల ఆదాయాన్ని మొదటి ప్రాధాన్యంగా సిబ్బంది జీతాలకు వినియోగించాలనే నిబంధన పెట్టారు. చాలా పంచాయతీల్లో పాలకవర్గం.. సిబ్బందిని విస్మరించి ఇతర అభివృద్ధి పనులకే పంచాయతీ నిధులు వెచ్చిస్తుండటంతో పంచాయతీరాజ్ అధికారులు దీనికి చెక్ పెట్టారు. సిబ్బంది జీతాలకు సరిపడా నిధులను ఉంచి, మిగిలిన నిధులను మాత్రమే ఇతర అవసరాలకు వాడుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒక నెల జీతాలకు సరిపడా నిధులను పంచాయతీలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. దీంతో పంచాయతీ సిబ్బందికి ఇకపై క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం ఉంది.