Share News

స్వదేశీ విధానంతోనే దేశ ప్రగతి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:25 AM

స్వదేశీ విధానం, వికేంద్రీకరణ, అంత్యోదయ భావనలే దేశ ప్రగతికి మార్గదర్శకాలని ఏకాత్మ మానవ దర్శన సభలో మేధావులు, వక్తలు అభిప్రాయపడ్డారు.

స్వదేశీ విధానంతోనే దేశ ప్రగతి

  • దీన్‌ దయాళ్‌ ఆలోచనలు మోదీ పాలనలో అమలు

  • ఏకాత్మ మానవదర్శన పునఃస్మరణ సదస్సులో వక్తలు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): స్వదేశీ విధానం, వికేంద్రీకరణ, అంత్యోదయ భావనలే దేశ ప్రగతికి మార్గదర్శకాలని ఏకాత్మ మానవ దర్శన సభలో మేధావులు, వక్తలు అభిప్రాయపడ్డారు. దేశానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ భారతీయత ప్రతిబింబించాలని, మన సంస్కృతి, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏకాత్మ మానవతా వాదంతో సమతుల్యం అవుతుందని పేర్కొన్నారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీ తయారీ పెంచడంతో పాటు వినియోగం పెరగాలని ఆకాంక్షించారు. విజయవాడలో 1965 జనవరి చివరి వారంలో పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ నేతృత్వంలో జరిగిన ఏకాత్మ మానవతా సదస్సులో భావి భారతావనిలో ఆర్థిక, రక్షణ, అందరికీ ఆరోగ్యం, ఆర్టికల్‌ 370 రద్దు, మహిళా సాధికారత, అంత్యోదయ ఇతర పాలనాపరమైన విధానాలు ఎలా ఉండాలో తీర్మానాలు చేశారు. ఆ సదస్సు జరిగి 60ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ బీజేపీ పునఃస్మరణ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ.. భారతీయ జనసంఘ్‌ బలోపేతానికి 1965లో విజయవాడలో పునాది పడిందని, బెజవాడను బీజేపీ ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. ఆత్మ, బుద్ధి, మనసు, శరీరాల సమతుల్యతే ఏకాత్మ సిద్ధాంతమని వివరించారు.


వికేంద్రీకరణ లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని దీన్‌ దయాళ్‌ స్పష్టం చేశారని, అవే సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రధాని మోదీ పాలనలో అమలు అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ స్వదేశీ విధానంతో దేశం అభివృద్ధి చెందాలన్నదే దీన్‌ దయాళ్‌ లక్ష్యమన్నారు. దీన్‌ దయాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌ జైన్‌ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం, అందరికీ ఆరోగ్యం వంటి లక్ష్యాలతో సాగిన నాటి ఆలోచనలకు ప్రస్తుత ఏన్డీఏ ప్రభుత్వం రూపం ఇచ్చిందని వివరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్‌, బీజేపీ జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:25 AM