Share News

స్వచ్ఛాంధ్ర.. మన జీవన విధానం కావాలి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:20 AM

స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, మన జీవన విధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పీల్చే గాలి, తినే తిండి, తాగే నీళ్లు.. ఇలా అన్నీ పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి.

స్వచ్ఛాంధ్ర.. మన జీవన విధానం కావాలి

  • సహకరిస్తే రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేస్తా: చంద్రబాబు

స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, మన జీవన విధానం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘పీల్చే గాలి, తినే తిండి, తాగే నీళ్లు.. ఇలా అన్నీ పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. ఇవన్నీ కావాలంటే మన ఆలోచనలు స్వచ్ఛం గా ఉండాలి. స్వచ్ఛమైన ఆలోచనల్లేని నేరస్థులు పాలిస్తే ఎలా ఉంటుందో గత ఐదేళ్లు చూశాం. స్వచ్ఛాంధ్ర విషయంలో మీరం తా సహకరిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తయారు చేస్తాను. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు మోదీ స్వచ్ఛ భారత్‌ తెచ్చారు. గతంలో మనం కూడా జన్మభూమి, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమాలతో స్వచ్ఛత కో సం పనిచేశాం. పరిశుభ్రత విషయంలో మనందరి ఆలోచనలు మారాలి. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండేందుకు ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. దీంతో విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగరాల్లో భారీ స్వీపింగ్‌ యం త్రాలను వినియోగిస్తున్నాం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 97.26 శాతం, గ్రా మీణ ప్రాంతాల్లో 62 శాతం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరుగుతోంది. మార్చి నాటికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వంద శాతం సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారీ యూనిట్లు ఇప్పటికే నాలుగు ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడలో మరో రెండు ప్రారంభించనున్నాం. ప్లాస్టిక్‌, ఈ-వే్‌స్టను సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. ఆయా ప్రాంతాల్లో ఈ వాహనాలు పర్యటించి చెత్త తీసుకుని నిత్యావసరాలు అందిస్తాయి. మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 660 స్వచ్ఛ రథాలను తీసుకొస్తాం’ అని అన్నారు.


గత ప్రభుత్వ చెత్తను తొలగిస్తున్నాం

రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశామని చంద్రబాబు చెప్పారు. 110 ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు ఖర్చు చేశామన్నారు. కంపోస్ట్‌ తయారీ కోసం డస్ట్‌బిన్లను ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రై సైకిళ్లు, తోపుడు బండ్లను ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోవడంతో భూమి, భూగర్భ జలాలతో పాటు వాయు కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఆ వ్యర్థాలన్నీ తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నట్లు చెప్పారు.


రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్‌..

‘గతంలో నేను టెక్నాలజీ అంటే అవహేళన చేశారు. ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపదను పెంచింది. రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్‌ ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై దృష్టి పెట్టే పరిస్థితి వస్తుంది. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండగా, ఇప్పుడు పీఎం సూర్యఘర్‌, కుసుమ్‌ పథకాల ద్వారా ఇళ్లపైన, పొలాల్లో సోలార్‌ విద్యుత్తు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. గ్రీన్‌ అమ్మోనియా, హైడ్రోజన్‌లాంటివి కూడా ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనాభా మన సంపద. గతంలో కుటుంబ నియంత్రణను నేనే ప్రోత్సహించా. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ మంది పిల్లలుంటేనే ఎన్నిక ల్లో అర్హత అంటున్నాను. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ జనాభా తగ్గుతోంది. మన వద్ద మాత్రమే జనాభా పెరుగుతోంది’ అని సీఎం తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, విప్‌ థామస్‌ వేదిక పంచుకున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్‌లో సీఎంను కలిశారు.

Updated Date - Jan 25 , 2026 | 03:21 AM