‘స్వచ్ఛ’ రథంసూపర్ హిట్!
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:20 AM
గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలను సంపదగా మార్చే ఉద్దేశంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన వినూత్న ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది! ‘స్వచ్ఛ రథం’ పేరుతో 434 వాహనాల ద్వారా...
చెత్తకు బదులుగా నిత్యావసర వస్తువుల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న 434 స్వచ్ఛ రథాలు
ఇప్పటి వరకు 995 టన్నుల వ్యర్థాల సేకరణ
ప్రతిగా రూ.1.40 కోట్ల విలువైన వస్తువుల అందజేత
వింజమూరులో ఒకే రోజు 1,116 కేజీల వేస్టు సేకరణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలను సంపదగా మార్చే ఉద్దేశంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన వినూత్న ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది! ‘స్వచ్ఛ రథం’ పేరుతో 434 వాహనాల ద్వారా ఇళ్లలో టన్నుల కొద్దీ నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్, ఇతర రకాల వస్తువుల ఘన వ్యర్థాలను సేకరిస్తున్నారు. పాత ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు, స్టీల్ వస్తువులను సేకరించి.. బదులుగా గ్రామీణులకు పప్పు, ఉప్పు, చింతపండు, సబ్బులు వంటి ఇతర నిత్యావసర వసువుల అందజేత విజయవంతంగా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో గుంటూరు రూరల్ మండలం లాలుపురంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు చాలా గ్రామాలకు విస్తరించింది. ఆర్నెల్ల కిందట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం పెరగడంతో పాటు గ్రామీణులకు అంతో ఇంతో ఆదాయం కల్పించవచ్చని ఈ ‘స్వర్ణ రథం’ అనే కాన్సెప్ట్ ను అమల్లోకి తెచ్చారు. ‘మీ ఇంట్లో ఏ వస్తువూ వృథా కాదు. అవసరం లేదని పారవేసే ప్రతి వస్తువుకూ విలువు ఉంది. ఎంతో కొంత ఆదాయం వస్తుంది’ అనే ప్రచారం చేశారు. ఇది పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వస్తు మార్పిడి విధానానికి అనుగుణంగా ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఎప్పటి నుంచో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం షెడ్డుల నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 10 వేలకు పైగా షెడ్డులను నిర్మించారు. చెత్తను వేరు చేసి, వర్మీ కంపోస్టుగా మార్చి రైతులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తడి, పొడి చెత్తలు కాకుండా ప్లాస్టిక్, పాత ఇనుము, ఇతర వ్యర్థాలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు జరగలేదు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ప్రత్యేక వాహనాలతో సేకరించడం ద్వారా గ్రామీణులకు ఎంతో కొంత ఆదాయం కల్పించవచ్చని నిర్ణయించారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు కేంద్రం ఆర్థిక సంఘం నిధులను ఏటా విడుదల చేస్తుంది. మేజర్ పంచాయతీల్లో ఎలాగూ చెత్త తరలించే వాహనాలు వాడతారు. ఈ క్రమంలో పంచాయతీలు ఈ నిధులను ‘స్వచ్ఛ రథం’ కోసం వాడుకునే వెసులుబాటు ఉంది.
1.40 కోట్ల విలువైన వస్తువుల అందజేత
పైలట్ ప్రాజెక్టు సఫలం కావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 434 స్వచ్ఛ రథాలను గ్రామాలకు పంపి.. వ్యర్థాల సేకరణ ప్రారంభించింది. దాదాపు 995 టన్నుల వేస్ట్‌ను సేకరించి, గ్రామీణులకు రూ.1.40 కోట్ల మేర విలువైన వస్తువులను అందించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ రథాల కోసం పలు గ్రామ పంచాయతీలు అభ్యర్థిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో గత వారంలో ఒకే రోజు 1,116 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, గ్రామీణులకు రూ.24 వేలకు పైగా విలువ చేసే వస్తువులను పంపిణీ చేశారు.
దేశంలోని రాష్ట్రాలు చేపట్టే పలు కార్యక్రమాలు బాగా క్లిక్ అవుతుంటాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎవర్ ఎన్విరో బయో ఎనర్జీ ప్లాంట్ ఆదర్శంగా నిలుస్తోంది. నగర వ్యర్థాలను సీఎన్‌జీ గ్యాస్‌గా మార్చే ఈ ప్రాజెక్టు దేశంలోని అతి పెద్ద బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు, స్థానిక సంస్థల నేతలు దీనిపై అధ్యయనం కోసం ఇండోర్‌ను సందర్శిస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్వచ్ఛ రథం’ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానుందని పలువురు పేర్కొంటున్నారు.