Share News

‘స్వచ్ఛ రథం’ సూపర్‌ హిట్‌

ABN , Publish Date - May 04 , 2026 | 04:15 AM

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛ రథం’ దూసుకుపోతోంది. గ్రామాల్లో ప్లాస్టిక్‌, ఇతర పొడి వ్యర్థాలను నిరోధించేందుకు పంచాయతీరాజ్‌...

‘స్వచ్ఛ రథం’ సూపర్‌ హిట్‌

  • పంచాయతీల్లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ

  • ఏప్రిల్‌లో 1866 టన్నులు.. బదులుగా గ్రామీణులకు 3.3 కోట్ల విలువైన నిత్యావసర వస్తువుల పంపిణీ

  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సిద్ధమైన వాహనాలు

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛ రథం’ దూసుకుపోతోంది. గ్రామాల్లో ప్లాస్టిక్‌, ఇతర పొడి వ్యర్థాలను నిరోధించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకొచ్చిన ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. ‘చెత్తతో సంపద’ నినాదంతో ఒక్క ఏప్రిల్‌లోనే రాష్ట్రవ్యాప్తంగా 1866 టన్నుల వ్యర్థాలను సేకరించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా మార్చి నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో స్వచ్ఛ రథం వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి నెలలోనే రికార్డు స్థాయి ఫలితాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణుల నుంచి మొత్తంగా 1866 టన్నుల పొడి చెత్తను సేకరించి.. దానికి బదులుగా రూ.3.31 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను అందించారు. ఏప్రిల్‌ 2న నిర్వహించిన స్కూల్‌ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి ఒక్కరోజే ఒక టన్ను పొడి చెత్తను సేకరించారు. పర్యావరణం పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో పెరుగుతున్న సామాజిక స్పృహకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.


అమల్లో పూర్తి పారదర్శకత

స్వచ్ఛ రథాలు క్షేత్రస్థాయిలో అద్భుత పనితీరు కనబరుస్తున్నాయి. సగటున ఒక్కో వాహనం ప్రతి రోజు 190 కిలోల పొడి చెత్తను సేకరిస్తూ, దానికి బదులుగా సుమారు రూ.3420 విలువైన వస్తువులను పంపిణీ చేస్తోంది. ఒక కేజీ పొడి చెత్తకు సగటున రూ.18 విలువ గల నిత్యావసర సరుకులు అందుతున్నాయి. ఈ లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటించేందుకు గానూ మార్కెట్‌ ధరల ప్రాతిపదికన పొడి చెత్త విలువను నిర్ణయించే అధికారాన్ని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారికి కల్పించారు. స్వచ్ఛ రథాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో పంచాయతీ అభివృద్ధి అధికారి నేతృత్వంలో స్వచ్ఛ రథం ప్రయోజనాలు, తద్వారా కలిగే లాభాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ.. గ్రామాలను ‘స్వర్ణ గ్రామాలు-స్వచ్ఛ గ్రామాలు’గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో అశాస్త్రీయంగా ఉన్న వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ఈ కార్యక్రమం సమూలంగా మారుస్తోంది.

Updated Date - May 04 , 2026 | 04:16 AM