‘అనంత’కు పవన శక్తి
ABN , Publish Date - Aug 25 , 2026 | 03:58 AM
పవన విద్యుత్తు రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సుజ్లాన్ సంస్థ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.
రాయదుర్గంలో సుజ్లాన్ భారీ పెట్టుబడి
రూ.10 వేల కోట్లతో 1325 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్ట్ స్థాపనకు సిద్ధం
ఇప్పటికే పూర్తయిన ఎస్144 విండ్ బ్లేడ్ల ఉత్పత్తి ప్లాంట్
ఈ ప్రాజెక్టులతో 4 వేల మందికి ఉపాధి
నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేశ్
అమరావతి/అనంతపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పవన విద్యుత్తు రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న సుజ్లాన్ సంస్థ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గోవిందవాడలో రూ. 10 వేల కోట్లతో 1325 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. దీంతోపాటు నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హొలికెర గ్రామంలో అత్యాధునిక ఎస్ 144 విండ్ బ్లేడ్ల తయారీకి ఆ సంస్థ సిద్ధమైంది. తక్కువ గాలిలోనూ గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తి ఈ బ్లేడ్ల ప్రత్యేకత. ఇప్పటికే పూర్తయిన ఈ బ్లేడ్ల కర్మాగారాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు చెప్పారు. సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1700 పైచిలుకు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ ఎనర్జీ భాగస్వామిగా ఉంది. 2030 నాటికి 5వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజ్లాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ భారీ పవన విద్యుత్తు ప్రాజెక్టులను స్థాపిస్తోంది. 2004లో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన ఆ సంస్థ.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పూరు ప్రాంతంలో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తోంది. ఇది అనంతపురంలోనే అతిపెద్ద విండ్ బ్లేడ్ తయారీ కేంద్రం.
ఇప్పటి వరకు ఇక్కడ రూ. 12 వేల కోట్ల పెట్టుబడులను పెట్టింది. వీటి ద్వారా 2,200 మంది యువతకు ఇప్పటికే ఉద్యోగాలు లభించాయి. సుజ్లాన్‌కు.. టాటా పవర్, వారీ ఫరెవర్ ఎనర్జీస్, హీలియోస్ ఇన్ర్ఫాటెక్ తదితర 70కిపైగా సంస్థలు కీలక ఖాతాదారులుగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం, సుజ్లాన్ సంస్థ సంయుక్తంగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ, విజయవాడల్లో ప్రపంచ స్థాయి విండ్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 12 వేల మంది యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 25 శాతం మహిళా ట్రైనీలు ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 20 గిగావాట్ల పవన విద్యుత్తు స్థాపన మైలురాయిని దాటిన తొలి భారతీయ కంపెనీగా సుజ్లాన్ సంస్థ నిలిచింది. దేశీయ పవన విద్యుత్తు మార్కెట్లో సుజ్లాన్ వాటా సుమారు 33 శాతంపైగా ఉంది. దేశంలోని ప్రతి మూడు విండ్ టర్బైన్లలో ఒకటి సుజ్లాన్‌లో తయారైందే.
లోకేశ్ పర్యటన ఇలా.. రాష్ట్ర మంత్రి లోకేశ్ మంగళవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 8.20 గంటలకు బళ్లారిలోని జిందాల్ విజయనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.40 గంటలకు బళ్లారి మండలం హలకుందిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్‌కు పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన ఉదయం 10.45 గంటలకు రాయదుర్గంలోని శాంతినగర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15బయలుదేరి 11.50 గంటలకు కణేకల్లు మండలం హొలికెరలో ఏర్పాటైన సుజ్లాన్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం నల్లంపల్లి నవాజ్ డెయిరీ ఫామ్‌కు చేరుకొని, సాయంత్రం 5.30 గంటల వరకు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణవుతారు.