Share News

సువర్ణ ఇండియా కేసులో సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:33 AM

పేద ప్రజలను మోసగించిన సువర్ణ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌ ఎండీ సహా డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి...

సువర్ణ ఇండియా కేసులో సంచలన తీర్పు

  • సంస్థ ఎండీ సహా డైరెక్టర్లకు జైలు శిక్షలు, భారీగా జరిమానాలు

అమలాపురం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలను మోసగించిన సువర్ణ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌ ఎండీ సహా డైరెక్టర్లకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్‌ జడ్జి గంధం సునీత తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా సోమవారం ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. సువర్ణ ఇండియా సంస్థ 2011లో 1600 మంది నుంచి సుమారు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసింది. రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన బూసిం వెంకట నాగ వేణు తన కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా పెట్టుకుని ప్రజలను నమ్మించి, సువర్ణ ఇండియా రియల్‌ ఎస్టేట్‌, స్టీలు, టీవీ చానల్స్‌ వంటి వివిధ విభాగాల పేరుతో ఫ్రెండ్‌షిప్‌ బాండ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించారు. 2015లో సంస్థను మూసివేశారు. అప్పట్లో బాధితుల ఫిర్యాదుతో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అరెస్టులు, కోర్టు విచారణ తర్వాత సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టులో సంస్థ ఎండీ బూసిం వెంకట నాగ వేణుకి ఆరు కేసుల్లో ఒక్కొక్క దాంట్లో ఏడేళ్ళ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.20 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏ2గా ఉన్న కంపెనీకి ఆరు కేసుల్లో 30 లక్షల జరిమానా, ఏ3గా ఉన్న బూసిం రాజ్యలక్ష్మికి ఆరు కేసుల్లో ఒక్కోదాంట్లో ఐదేళ్ల శిక్ష, 7.20 లక్షల జరిమానా, ఏ6గా ఉన్న బూసిం గౌతమికి ఆరు కేసుల్లో ఒక్కోదాంట్లో 3 ఏళ్ల శిక్ష, రూ.4.20 లక్షల జరిమానా విధించినట్టు ఎస్పీ తెలిపారు. ఏ4, ఏ5 నిందితులుగా ఉన్న వారికి ఎటువంటి శిక్ష పడలేదన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 06:42 AM