Share News

Madanapalle Files Burning Case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులోఆర్డీవో హరిప్రసాద్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:57 AM

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో నేరపూరిత నిర్లక్ష్యం వహించారని, భూవ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు...

Madanapalle Files Burning Case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులోఆర్డీవో హరిప్రసాద్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

  • ఆరోపణలపై విచారణ బాధ్యతలు అన్నమయ్య జేసీకి అప్పగింత

అమరావతి/కలికిరి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో నేరపూరిత నిర్లక్ష్యం వహించారని, భూవ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన నాటి ఆర్డీవో సి.హరిప్రసాద్‌కు ఊరట లభించింది. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో హరిప్రసాద్‌కు పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది. 2024 జూలై 21న జరిగిన ఫైళ్ల దహనం ఘటనలో కుట్రకోణం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఆర్డీవో సి.హరిప్రసాద్‌, అయనకన్నా ముందు ఆర్డీవోగా చేసిన డిప్యూటీ కలెక్టర్‌ ఎం.ఎ్‌స.మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ జి.గౌతమ్‌తేజ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకొని, సస్పెండ్‌ చేసింది. అభియోగాలపై హరిప్రసాద్‌ అక్టోబరు 26న రెవెన్యూ శాఖకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. జరిగిన ఘటనకు తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. చుక్కల భూములు, 22(ఏ) జాబితా నుంచి భూములను తొలగించారన్న దాంట్లో ప్రమేయం లేదన్నారు. మరోవైపు పైళ్ల దహనం, రికార్డుల తారుమారు వంటి ఆరోపణలపై శాఖాపర విచారణాధికారిగా అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ను నియమిస్తూ రెవెన్యూశాఖ మరో ఉత్తర్వు ఇచ్చింది. ఆరువారాల్లో విచారణ పూర్తిచేయాలని పేర్కొంది. హరిప్రసాద్‌, మురళి, గౌతమ్‌ తేజ్‌పై అభియోగాలు, వారి స్టేట్‌మెంట్‌లను పరిశీలించి, విచారణ చేయాలని తెలిపింది.

Updated Date - Jan 10 , 2026 | 04:57 AM