పంట నష్టం సర్వే వేగవంతం
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:32 PM
ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలన్నీ ఎండిపోయి కరువు తాండవిస్తోంది.
30లోగా ప్రభుత్వానికి నివేదిక
కర్నూలు జిల్లాలో 15, నంద్యాల జిల్లాలో 28 కరువు మండలాల్లో సర్వే
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలన్నీ ఎండిపోయి కరువు తాండవిస్తోంది. పంట నష్టానికి గురైన రైతులను తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం కరువు మండలాల జాబితాను ఈ మధ్యనే ప్రకటించింది. ఈ కరువు మండలాల్లో ఏ మేరకు పంట నష్టం జరిగిందో ఈ నెలాఖరులోపు సర్వే చేసి నివేదికను అందజేయాలని కలెక్టర్ల్కు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఆయా మండలాల్లో పంట నష్టం వివరాలపై సర్వేను వేగవంతం చేశారు. కర్నూలు జిల్లాలో 15 మండలాలు, నంద్యాల జిల్లాలో 28 మండలాలను మొదటి విడత కరువు మండలాల జాబితాలో ప్రభుత్వం చేర్చింది. కర్నూలు జిల్లాలో ఆదోని-1, హొళగుంద, గూడూరు, కర్నూలు రూరల్, ఓర్వకల్లు, కోడుమూరు, హాలహర్వి, ఆలూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, పత్తికొండ, చిప్పగిరి, మద్దికెర, తుగ్గలి, కర్నూలు అర్బన మండలాలను కరువు జాబితాలో చేర్చారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, ఆత్మకూరు, పాములపాడు, మిడ్తూరు, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల రూరల్, మహానంది, శిరివెళ్ల, గోస్పాడు, బనగానపల్లె, డోన, ప్యాపిలి, ఓర్వకల్లు, కోవెలకుంట్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, దొర్నిపాడు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, చాగలమర్రి, నంద్యాల అర్బన మండలాలను కరువు జాబితాలో చేర్చారు. ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల హెక్టార్లలో పత్తి, వేరుశనగ, ఆముదం, కంది, ఉల్లి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 90 శాతం ఎండల తీవ్రతకు మట్టిలో కలిసిపోయాయి. ప్రస్తుతం కరువు జాబితాలో చేర్చిన ఉమ్మడి జిల్లాలోని 43 మండలాల్లో వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతుల పొలాలకు వెళ్లి ఎంత మేర నష్టం జరిగిందీ వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు.
ఫ ఈనెలాఖరులోపు నివేదిక అందజేస్తాం : వరలక్ష్మి, జేడీ, కర్నూలు:
ఎల్‌నినో రైతులను పూర్తిగా నష్టపరిచింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కర్నూలు జిల్లాలో మొదటి విడతగా 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన 12 మండలాల్లోనూ కరువు పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదికను అందజేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరులోపు కలెక్టర్ ద్వారా ఎంత మేర రైతులు పంట నష్టానికి గురైందీ పూర్తి వివరాలతో ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేదికను అందజేస్తాం.