Share News

సర్జరీలు చేసేదేలా..!?

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:31 AM

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే.. మరోవైపు శస్త్రచికిత్స పరికరాల (సర్జికల్‌ ఐటమ్స్‌) కొరతతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి.

సర్జరీలు చేసేదేలా..!?

  • ఆస్పత్రుల్లో పరికరాల కొరత

  • రోగులకు నిలిచిపోతున్న శస్త్రచికిత్సలు

  • రోజుకు ఐదారు ఆపరేషన్లు చేయాల్సిన చోట ఒకటి, రెండుతో సరిపెడుతున్న వైద్యలు

  • విశాఖ, శ్రీకాకుళం, ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే.. మరోవైపు శస్త్రచికిత్స పరికరాల (సర్జికల్‌ ఐటమ్స్‌) కొరతతో ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. రోజుకు ఐదారు ఆపరేషన్లు చేయాల్సిన చోట.. ఒకటి లేదా రెండుతో సరిపెడుతున్నారు. కొన్ని బోధనాస్పత్రుల్లో ఒక్కోరోజు అవికూడా జరగడం లేదు. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్‌, శ్రీకాకుళం, ఒంగోలు, కర్నూలు, కాకినాడ బోధనాస్పత్రుల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వచ్చే ఇండెంట్‌కు అనుగుణంగా సర్జికల్‌ ఐటమ్స్‌ను ఇవ్వడంలో ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పూర్తిగా విఫలమవుతున్నారు. విశాఖపట్నం, కాకినాడ చాలా పెద్దాస్పత్రులు. ఇక్కడ ఒక్కరోజు ఆపరేషన్‌ థియేటర్‌ (ఓటీ) ఆగినా పదుల సంఖ్యలో రోగులు వేచి చూడాల్సిన పరిస్థితి. విశాఖ కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అయితే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వంద సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం ఇంటెండ్‌ వస్తే 10 లేదా 20 మాత్రమే ఇస్తున్నారు. వీటితో సర్జరీలు చేయడం ఎలా..? అంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. తాము శస్త్రచికిత్సలు చేయలేమంటూ 8 మంది సీనియర్‌ వైద్యులు చేతులెత్తేశారు. కాకినాడ, కర్నూలు పరిస్థితీ ఇలాగే ఉంది. మరోవైపు లాప్రోస్కోపిక్‌ సర్జరీలు చేసేందుకు వైద్యులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం విశాఖ, కాకినాడ, కర్నూలు వంటి ఆస్పత్రుల్లో లాప్రోస్కోపిక్‌ సర్జరీలు చేస్తున్నారు. కానీ.. సర్జికల్‌ ఐటమ్స్‌ కొరత వల్ల మళ్లీ పాత విధానమైన కోతల్లోకి వస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోగులకు శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.


బడ్జెట్‌ కొరత...

మరోవైపు సర్జరీలకు అవసరమైన పరికరాలు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సప్లయ్‌ కావాలి. కార్పొరేషన్‌ అధికారులు.. మందులే సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారు. ఇక సర్జికల్‌ ఐటమ్స్‌ గురించే ఆలోచించే పరిస్థితి లేదు. ప్రస్తుతం కమీషన్లు ఎక్కువ వచ్చే వైద్య పరికరాలు, సర్జికల్‌ ఐటమ్స్‌ను కొనుగోలు చేయడంపైనే దృష్టిపెట్టారు. మరోవైపు సూపరింటెండెంట్లు.. కార్పొరేషన్‌ సరఫరా చేసే సర్జికల్‌ ఐటమ్స్‌పై ఆధారపడకుండా వారికి అదనంగా కేటాయించే డీ-సెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ, కార్పొరేషన్‌ నుంచి ఏడాదిన్నరగా ఆ బడ్జెట్‌ విడుదల కావడం లేదు. దాదాపు రూ.25 నుంచి రూ.30 కోట్లు పెండింగ్‌లో పెట్టుకున్నారు. దీంతో బోధనాస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆరోగ్యశాఖ అధికారులు కనీసం డీ-సెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ విడుదల చేసినా తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది.

Updated Date - Apr 22 , 2026 | 05:32 AM