Share News

సీఐ నాగరాజు విచారణ సిట్‌ కార్యాలయంలోనే!

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:57 AM

రౌడీషీటర్‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడు సీఐ నాగరాజును సిట్‌ కార్యాలయంలోనే విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పోలీసు కస్టడీ సమయంలో ఇంటరాగేషన్‌కు సంబంధించి దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఉండాలని తెలిపింది.

సీఐ నాగరాజు విచారణ సిట్‌ కార్యాలయంలోనే!

  • సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

  • రాజమండ్రి జైల్లోనే విచారించాలనడం ఆచరణీయం కాదు..ఆయన భద్రతకు సిట్‌దే పూచీ

  • ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడు సీఐ నాగరాజును సిట్‌ కార్యాలయంలోనే విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పోలీసు కస్టడీ సమయంలో ఇంటరాగేషన్‌కు సంబంధించి దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఉండాలని తెలిపింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలన్న షరతు ఆచరణీయం కాదని, దానిని సమర్థించలేమని పేర్కొంది. నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచిన నాటి నుంచి 7 రోజులపాటు కస్టడీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సీసీటీవీ, వీడియో గ్రాఫిక్‌ పర్యవేక్షణలో ఇంటగారేషన్‌ జరగాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. హైకోర్టు విధించిన కొన్ని షరతులు.. కస్టడీలో విచారణ సమర్థంగా జరగడానికి అడ్డంకిగా మారతాయని, అప్పుడు మొత్తం విచారణ ప్రక్రియ వృథా అవుతుందనే దర్యాప్తు సంస్థ ఆందోళన సరైనదేనని పేర్కొంది. నాగరాజును రాజమండ్రి జైల్లోనే విచారించాలంటూ ఈ నెల 7న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైల్లోనే విచారణ సాగించాలని.. అవసరమైనప్పుడు నేరఘటనకు నిందితుడిని తీసుకురావచ్చని.. అయితే రాజమండ్రి జైలు నుంచి విజయవాడ వరకు 160 కిలోమీటర్ల ప్రయాణం మొత్తాన్ని.. ప్రతి కదలికను వీడియో రికార్డింగ్‌ చేయాలని హైకోర్టు షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆచరణసాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విచారణ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని.. సీసీటీవీ రికార్డింగ్‌ చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో మాత్రం ఏకీభవిస్తున్నట్లు తెలిపింది.


తన ప్రాణానికి ముప్పుందని.. వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుందన్న నిందితుడి ఆందోళన దృష్ట్యానే.. కస్టడీ విచారణ సమయంలో ఆయన్ను బెదిరించడం, ప్రలోభపెట్టడం.. భౌతికంగా దాడిచేయడం.. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయకూడదని హైకోర్టు స్పష్టంచేసినందున.. ఆయన భద్రతకు సిట్‌దే పూచీ అని తేల్చిచెప్పింది. పోలీసు కస్టడీ సమయంలో నాగరాజు భద్రతకు దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీ, సిట్‌ సభ్యులు, జైలు సూపరింటెండెంట్‌ సంయుక్తంగా, విడివిడిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ‘కేసు వాస్తవాల దృష్ట్యా మొత్తం కస్టడీ విచారణను సెంట్రల్‌ జైలుకు పరిమితం చేయడం సమర్థనీయం కాదు. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. కృష్ణలంక పోలీసు స్టేషన్‌ సీసీటీవీ సిస్టమ్‌ ఒరిజినల్‌ హార్డ్‌ డిస్క్‌లను ఇంకా రికవరీ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌ నిందితుడిని సక్రమంగా విచారించి వాస్తవాలను రాబట్టాల్సి ఉంటుంది. 160 కిలోమీటర్ల దూరాన ఆయన్ను విచారిస్తే సరిపోదు. మృతదేహం లభ్యమైన ప్రదేశానికి నిందితుడిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సత్ఫలితాలివ్వడం అనేది దర్యాప్తు అధికారిపైనే ఆధారపడి ఉంటుంది. బీఎన్‌ఎస్ఎస్‌ సెక్షన్లు 187(2), (3) ప్రకారం పోలీసు కస్టడీ 15 రోజులకు మించరాదు. అవసరమైనప్పుడు విడతలవారీగా దీనిని దర్యాప్తు సంస్థ వినియోగించుకోవచ్చు. పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసి.. విచారించేటప్పుడు.. తన న్యాయవాదిని కలిసే హక్కు నిందితుడికి ఉంటుంది. అయితే నాగరాజు కనిపించే పరిధిలో మాత్రమే న్యాయవాది ఉండవచ్చు. అయితే ఏ పరిస్థితిలోనూ విచారణలో న్యాయవాది జోక్యం చేసుకోకూడదు’ అని స్పష్టం చేసింది. తమ తీర్పులో గానీ, హైకోర్టు తీర్పులో గానీ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల ప్రభావం లేకుండా చట్టానికి లోబడి సిట్‌ నిష్పాక్షికంగా శాస్ర్తీయంగా దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.


సిట్‌ కార్యాలయం సురక్షితం కాదనడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. నిందితుడి కస్టడీ ఏడు రోజులపాటే ఉంటుందని తెలిపింది. ‘కస్టడీలో నిందితుడిని ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి. నాగరాజును రాజమండ్రి జైల్లో మాత్రమే విచారించాలన్న ఆదేశాలను కొట్టివేస్తున్నాం. సీసీటీవీ, వీడియోగ్రాఫిక్‌ పర్యవేక్షణలోనే విచారణ జరగాలి. అయితే దీనర్థం..నిందితుడిని ఆయా చోట్లకు తీసుకెళ్లేటప్పుడు నిరంతరాయంగా వీడియో రికార్డింగ్‌ చేయడం కాదు. సీసీటీవీ ఫుటేజ్‌ను, వీడియోగ్రాఫిక్‌ రికార్డింగ్‌ను ఒరిజినల్‌ రూపంలో సంబంధిత మేజిస్ట్రేట్‌కు సమర్పించాలి. తొలగింపులు, ఎడిటింగ్‌లు, తారుమారు చేయడానికి వీల్లేదు’ అని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, నాగరాజు కస్టడీ విచారణ విజయవాడ సిట్‌ కార్యాలయంలోనే జరుగనుంది. దర్యాప్తు అధికారులు నాగరాజును మంగళవారం రాజమండ్రి జైలునుంచి కస్టడీకి తీసుకోనున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి.. కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత వారంరోజులు ప్రశ్నిస్తారు.

Updated Date - Jul 28 , 2026 | 05:58 AM