Share News

ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరగా తేల్చండి!

ABN , Publish Date - May 19 , 2026 | 04:47 AM

ఇసుక అక్రమ తవ్వకాలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది.

ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరగా తేల్చండి!

  • కేసు విచారణ బాధ్యతలు కొత్త బెంచ్‌కు అప్పగించండి

  • ఏపీ హైకోర్టు సీజేకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, మే 18(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తవ్వకాలపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న 77 రిట్‌ పిటిషన్ల విచారణను కొత్తబెంచ్‌కు అప్పగించాలని జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసి్‌హలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం నిర్దేశించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై జయ ప్రకాశ్‌ వెంచర్స్‌ పవర్‌ లిమిటెడ్‌(జెపీ వెంచర్స్‌)కు వ్యతిరేకంగా గతంలో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. జేపీ వెంచర్స్‌కు దాదాపు రూ.18 కోట్ల జరిమానా విధించింది. ఆ తీర్పును 2023లో జేపీ వెంచర్స్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘రాష్ట్రప్రభుత్వం జారీచేసిన డిమాండ్‌ నోటీసులను సవాలు చేస్తూ జేపీ వెంచర్స్‌ 51, ప్రతిమ ఇన్‌ఫ్రా 19, జీసీకేసీ 7 కలిపి మొత్తం 77 రిట్‌ పిటిషన్లను ఏపీ హైకోర్టు ముందు దాఖలు చేశాయి. విచారించిన ఏకసభ్య ధర్మాసనం ఆ డిమాండ్‌ నోటీసులపై ేస్ట ఇస్తూ పోతోంది’ అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే, ఎన్జీటీ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టు తన ముందున్న కేసులపై త్వరగా విచారణ ముగించాల్సిందిగా కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఆ పిటిషన్‌ సోమవారం మరోసారి విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూరథ, హుజేఫా అహ్మదీతోపాటు ఇరుపక్షాల తరఫున ముకుల్‌ రోహిత్గి, మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు.


ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు సుదీర్ఘంగా విచారించిందని, అయితే తీర్పు వెలువరించకముందే ఆ ధర్మాసనంలోని ప్రిసైడింగ్‌ జడ్జి పదవీ విరమణ పొందారని తెలిపారు. దీంతో 77 రిట్‌ పిటిషన్లపై ఎలాంటి ముందడుగూ పడలేదన్నారు. ప్రధాన కేసుతోపాటు ఇతర పిటిషన్లను మరో ధర్మాసనం విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. తీర్పు రాకముందే జడ్జి రిటైర్‌ అయినందున కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్ల విచారణను తక్షణమే కొత్త బెంచ్‌కు అప్పగించాలని హైకోర్టు సీజేకు సూచించింది. అన్ని పిటిషన్లు కలిపి విచారించడం సాధ్యంకాని పక్షంలో కనీసం ప్రధాన కేసునైనా వేరుచేసి త్వరగా విచారణ చేపట్టాలని నిర్దేశించింది. పర్యావరణ నష్టంపై పరిహారం అంశాన్ని తాము ప్రస్తుతానికి విచారించడం లేదని, కక్షిదారులు తమ వాదనలన్నింటినీ హైకోర్టులోనే ేస్వచ్ఛగా వినిపించుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను జూలై మొదటి వారానికి వాయిదా వేసింది.

Updated Date - May 19 , 2026 | 04:48 AM