హథీరాంజీ మఠానికికొత్త మహంత్‌ను నియమించొద్దు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:16 AM
తిరుపతిలోని శ్రీ స్వామి హథీరాంజీ మఠం మఠాధిపతి (మహంత్) పదవి నుంచి అర్జున్‌దా్‌సను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధార్మిక పరిషత్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
స్టే విధించిన సుప్రీంకోర్టు.. మఠం ఆస్తుల విక్రయాలు, బదిలీలకు వీల్లేదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని శ్రీ స్వామి హథీరాంజీ మఠం మఠాధిపతి (మహంత్) పదవి నుంచి అర్జున్‌దా్‌సను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధార్మిక పరిషత్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయన స్థానంలో కొత్త మఠాధిపతిని నియమించవద్దని స్పష్టంచేసింది. అలాగే మఠానికి చెందిన ఆస్తులను విక్రయించడం లేదా అన్యాక్రాంతం చేయడంలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. తనను అకారణంగా తొలగించారంటూ అర్జున్ దాస్ దాఖలుచేసిన వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొత్త మఠాధిపతి నియామక ప్రక్రియపై స్టే విధించింది. మఠం ఆస్తులను ప్రస్తుతానికి విక్రయించకూడదని లేదా బదిలీ చేయకూడదని స్పష్టం చేసింది. వివాదం పరిష్కారమయ్యేంత వరకు మఠం ఆస్తులు, ఆదాయ వ్యయాలకు సంబంధించి పక్కాగా ఖాతాలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంతో పాటు ఆస్తుల నిర్వహణపై అవసరమైతే జ్యుడీషియల్ అధికారుల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.