Share News

‘డబుల్‌ గేమ్‌’కు చెక్‌!

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:19 AM

క్రైస్తవంలోకి మారితే... ఎస్సీ హోదా ఉండదు. వారు ఎంతమాత్రం దళితులు కాబోరు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

‘డబుల్‌ గేమ్‌’కు చెక్‌!

  • సుప్రీం సంచలన తీర్పుతో సర్వత్రా చర్చ

  • అటు కేసులు, ఇటు పాస్టర్లపై ప్రభావం

  • క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా పోయినట్లే

  • వైసీపీ హయాంలో ఎడాపెడా ‘అట్రాసిటీ’ కేసులు

  • రాజధాని రైతులు, టీడీపీ నేతలపై చట్టంతో గురి

  • ఫిర్యాదుదారుల్లో క్రైస్తవం తీసుకున్న వారూ!

  • వారి నేపథ్యం పరిశీలిస్తే కేసులు వీగినట్లే

  • పాస్టర్లలో అత్యధికులు మతం మారిన వారే

  • అటు ఎస్సీ ఫలాలు, ఇటు గౌరవ వేతనాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘క్రైస్తవంలోకి మారితే... ఎస్సీ హోదా ఉండదు. వారు ఎంతమాత్రం దళితులు కాబోరు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనిని సమర్థించేవారితోపాటు, సరికాదనే వారూ ఉన్నారు. ఆ విషయం ఎలా ఉన్నా... ఈ తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దీంతోపాటు... దళితులుగా ఉండి, తర్వాత పాస్టర్లుగా మారిన కొందరు పొందుతున్న ‘ద్వంద్వ లబ్ధి’పైనా చర్చ జరుగుతోంది. ఎస్సీ నుంచి క్రైస్తవంలోకి మారిన బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్‌ ఆనంద్‌... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రయోగించింది. రాజధాని రైతులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలను భయపెట్టేందుకు ఎడాపెడా అట్రాసిటీ కేసులు పెట్టించింది. చివరికి... దళితులపైనా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం కింద అరెస్టయితే అంత తేలిగ్గా బెయిల్‌ దొరకదు. జైలులో మగ్గాల్సిందే. దీంతో అప్పట్లో టీడీపీ క్యాడర్‌ గ్రామాలను వదిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసులపై చర్చ మొదలైంది. అప్పటో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేసిన వారంతా నిజంగా ఎస్సీలేనా.. క్రైస్తవంలోకి మారినవారూ ఉన్నారా? ఆ ఫిర్యాదీల నేపథ్యాన్ని వెలికి తీస్తే... సంబంధిత కేసులూ వీగిపోతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


ఆ పాస్టర్లకు చిక్కులే!

చట్టాలు, కోర్టు తీర్పుల ప్రకారం క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు. మతం మారి, క్రైస్తవాన్ని ఆచరిస్తున్నప్పటికీ... రిజర్వేషన్లు పొందుతున్న వారెందరో ఉన్నారు. సర్టిఫికెట్‌లో ‘ఎస్సీ’గానే కొనసాగుతుండటమే దీనికి కారణం. ఇలా ద్వంద్వ ప్రయోజనాలు పొందుతున్న పాస్టర్లకు ఇప్పుడు కష్టమే. పాస్టర్లలో చాలామంది ఎస్సీలు ఉన్నట్లు అంచనా. ఒకవైపు పాస్టర్లుగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతూ, మరోవైపు సర్టిఫికెట్‌ పరంగా ఎస్సీలుగా కొనసాగుతున్న వారూ ఉన్నారు. చిన్నపాటి పరిశీలన జరిగినా వీరు ఎస్సీ హోదా కోల్పోతారు. సంబంధిత పథకాల ప్రయోజనాలకూ అనర్హులుగా మారతారు. ఎందుకంటే... స్వయానా మత బోధనలు చేస్తున్న వీరు... క్రైస్తవులుగా తమ ఉనికిని దాచుకోలేరు. అయితే... ఇంకెవరైనా ఫిర్యాదు చేయడం, కోర్టులకు వెళ్లడం వంటివి జరిగితే తప్ప ప్రభుత్వం తనంత తాను స్పందించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 03:19 AM