Share News

ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి నో బెయిల్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:17 AM

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని...

ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి నో బెయిల్‌

  • మద్యం కేసులో నిరాకరించిన సుప్రీంకోర్టు

  • బెయిలిస్తే మళ్లీ పారిపోయే ప్రమాదం

  • గతంలో శ్రీలంకకు పారిపోయాడు

  • కస్టడీకి ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వం అభ్యర్థన

  • 20కి తదుపరి విచారణ వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాశ్‌ రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌ మాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ముప్పిడి అవినాశ్‌ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధ్దార్థ్‌ దవే వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని, దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తామని కోరారు. ఈ వాదనలపై ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా వెళ్లాడని, దీనివల్ల దర్యాప్తులో ఆలస్యం జరిగిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు శ్రీలంకకు పారిపోయాడని తెలిపారు. బెయిలిస్తే మళ్లీ పరారయ్యే అవకాశం ఉందన్నారు. అవినాశ్‌ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇరువాదనల అనంతరం.. రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే కస్టడీకి ఇవ్వడంపై స్పందిస్తూ.. ట్రయల్‌ కోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉందని, అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

Updated Date - Mar 13 , 2026 | 03:18 AM