Share News

‘ఫైళ్ల దహనం’ తీవ్రమైన నేరం

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:58 AM

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారికి ముందస్తు బెయిల్‌ను కోర్టు నిరాకరించింది.

‘ఫైళ్ల దహనం’ తీవ్రమైన నేరం

  • రికార్డ్‌ రూమ్‌లో మంటలెలా వచ్చాయి?

  • దీని వెనుక ఉన్న ప్లాన్‌ ఏమిటి?

  • పోలీసులు లోతుగా విచారించాలి

  • మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

  • పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్‌కు నో

  • పిటిషన్‌ కొట్టివేత.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యానికి నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారికి ముందస్తు బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎటువంటి బలమైన కారణాలు కనిపించడం లేదంటూ, నిందితుల పిటిషన్లను కొట్టివేసింది. ఫైళ్ల దహనం తీవ్రమైన నేరం అని వ్యాఖ్యానించింది. పైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి, ఇతరుల ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం జస్టిస్‌ మనోజ్‌మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. నిందితుల తరపున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, రాష్ట్రప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. నిందితుడికి ఘటనతో సంబంధం లేదని, మంత్రి వద్ద పీఏగా పనిచేశారనే కారణంతోనే ఈ కేసులోకి లాగారని దామా శేషాద్రినాయుడు వాదించారు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఆయన లేరని, అప్పటికి ఆరు నెలలుగా విదేశాల్లో ఉంటున్నారన్నారు.


ఆయనకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవని, కేవలం అనుమానంతోనే కేసు పెట్టారని పేర్కొన్నారు. నిందితుల తరఫు వాదనలు విన్న బెంచ్‌, ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్ల దహనం అత్యంత తీవ్రమైన నేరమని అభిప్రాయపడింది. ‘‘రికార్డ్‌ రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనుక ఉన్న ప్లాన్‌ ఏమిటి? అనే విషయాలను పోలీసులు లోతుగా విచారించాల్సి ఉంది’’ అని వ్యాఖ్యానించింది. నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని, ఇటువంటి కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. చట్టప్రకారం విచారణ కొనసాగాలని, ఇందుకు నిందితుడు సహకరించాలని స్పష్టం చేసింది.

Updated Date - Mar 10 , 2026 | 03:58 AM